
భారతీయ ఐటీ రంగాన్ని "సైలెంట్ లేఆఫ్‌లు" ముంచెత్తుతున్నాయి. 2023-24 మధ్య సుమారు 25,000 మంది ఇలా ‘నిశ్శబ్దం’గా ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచనా. ఈ ఏడాది అంటే 2025 చివరికి ఈ సంఖ్య రెట్టింపు 50,000 నుండి 60,000 వరకు చేరే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ తొలగింపులకు ప్రధాన కారణాలు
వ్యాపార వృద్ధిలో మందగమనం, సామాన్య ఇంజినీరింగ్ పనులను ఆటోమేట్ చేయగల ఏఐ (AI) టెక్నాలజీ పెరుగుదల, సంస్థలు ఖర్చు తగ్గింపు చర్యలు తీసుకోవడమే ఈ తొలగింపులకు ప్రధాన కారణాలు.
కంపెనీలు బహిరంగంగా తొలగింపులు ప్రకటించకుండా, ఉద్యోగులే స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చే విధానాలు అనుసరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులను ప్రత్యామ్నాయ ఉపాధి వెతుకుకోమని సూచిస్తున్నాయి.
ఉదాహరణకు, టీసీఎస్ మార్చి 2026 నాటికి తమ శ్రామిక శక్తిలో 2% తగ్గింపు (సుమారు 12,000 ఉద్యోగాలు) ప్రకటించింది. యాక్సెంచర్ 865 మిలియన్ డాలర్ల వ్యాపార ఆప్టిమైజేషన్ ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 11,000 ఉద్యోగాలను తొలగించింది.
హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్‌కు చెందిన ఫిల్ ఫెర్ష్ట్ ప్రకారం.. పనితీరు మూల్యాంకనాలు, నియామకాల తగ్గింపు, కెరీర్ పురోగతికి బ్రేక్ వంటి పద్ధతుల ద్వారా ఉద్యోగులను నిశ్శబ్దంగా తొలగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
మారుతున్న టెక్నాలజీ, కాలం చెల్లిన ప్లాట్‌ఫామ్‌లు, నూతన నైపుణ్యాల అవసరం కారణంగా స్కిల్స్ అప్‌గ్రేడ్ తప్పనిసరి అయిందని, లేకపోతే ఉద్యోగాలపై ముప్పు ఉంటుందని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ హెచ్చరిస్తున్నారు.
ఈ నిశ్శబ్ద తొలగింపుల వల్ల ఉద్యోగ భద్రతపై అనిశ్చితి పెరుగుతోంది. ఉద్యోగులు తమ నైపుణ్యాలను విస్తరించుకోవడం, కొత్త టెక్నాలజీలపై ప్రావీణ్యం సాధించడం ద్వారా మాత్రమే ఈ సంక్షోభాన్ని అధిగమించగలరు.