ఆటోమొబైల్‌ కంపెనీలపై సర్వే.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు!

Indian Auto Firms Key Management Have Poor Understanding Obligations: Report - Sakshi

ప్రతి రంగంలోనూ కంపెనీలు పాటించాల్సిన రూల్స్‌, చట్టాలు బోలెడు ఉంటాయి. సంస్థలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, కార్యక్రమాలు జరపాలన్నా వీటిని తప్పక పాటించాలి. అయితే ప్రస్తుత దేశీ ఆటోమొబైల్‌ కంపెనీల్లో ఈ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఆయా కంపెనీల మేనేజ్‌మెంట్‌లోని కీలక హోదాల్లో ఉన్న వారికి (కేఎంపీ)వీటిపై అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ అంశం టీమ్‌లీజ్‌ రెగ్‌టెక్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

ఆటోమొబైల్‌ పరిశ్రమ పాటించాల్సిన నిబంధనలను సరళతరం చేయాల్సిన ఆవశ్యకతపై రెగ్‌టెక్‌ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం చిన్నపాటి వాహనాల తయారీ సంస్థ ఒక రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించాలంటే వన్‌టైమ్, ఏటా పాటించాల్సిన నిబంధనలు కనీసం 900 పైచిలుకు ఉంటున్నాయి. వన్‌టైమ్‌ అంశాలైన రిజిస్ట్రేషన్లు, అనుమతుల్లాంటివి పక్కన పెడితే కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితా కింద పాటించాల్సిన నిబంధనలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందల కొద్దీ చట్టాలు, నిబంధనలను తెలుసుకుని, పాటించడంపై కేఎంపీల్లో అవగాహన అంతంతమాత్రంగానే ఉంటోంది.

అనేకానేక నిబంధనలు, తేదీలు, డాక్యుమెంటేషన్‌ మొదలైనవన్నీ పాటించడం కష్టతరమవుతోంది. ఫలితంగా అనూహ్యంగా షోకాజ్‌ నోటీసులు అందుకోవడం, పెనాల్టీలు కట్టడం, లైసెన్సులు రద్దు కావడం వంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్‌–మే మధ్య కాలంలో 34 ఆటోమొబైల్‌ కంపెనీలపై రెగ్‌టెక్‌ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం గడిచిన ఏడాది కాలంలో తాము పాటించడంలో విఫలమైన కీలక నిబంధన కనీసం ఒక్కటైనా ఉంటుందని 95 శాతం మంది కేఎంపీలు తెలిపారు. అలాగే జరిమానాలు కట్టాల్సి వచ్చిందని 92 శాతం మంది వెల్లడించారు. నియంత్రణపరమైన నిబంధనల అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం సవాలుగా ఉంటోందని 52 శాతం మంది తెలిపారు.

చదవండి: ట్విటర్‌లో మస్క్‌ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top