164.7 లక్షల టన్నులకు పెరిగిన వంట నూనెల దిగుమతులు 

India Vegetable Oils Import 167.1 Lakh Tonnes - Sakshi

న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన సీజన్‌లో వంట నూనెల దిగుమతులు 16 శాతం అధికంగా నమోదయ్యాయి. అక్టోబర్‌తో ముగిసిన 2022–23 సీజన్‌లో 167.1 లక్షల టన్నుల వెజిటబుల్‌ నూనెల దిగుమతులు జరిగినట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్ట్రర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) ప్రకటించింది. దిగుమతులపై తక్కువ సుంకాలు వృద్ధికి దోహదం చేసినట్టు తెలిపింది. అంతకుముందు నూనెల సాగు సీజన్‌ 2021–22లో వెజిటబుల్‌ ఆయిల్‌ దిగుమతులు 144.1 లక్షల టన్నులుగా ఉన్నాయి. మొత్తం దిగుమతుల్లో 164.7 లక్షల టన్నులు వంట నూనెలు కాగా, ఇతర అవసరాలకు వినియోగించే (నాన్‌ ఎడిబుల్‌) నూనెల దిగుమతులు 2.4 లక్షల టన్నులుగా ఉన్నాయి.

‘‘2022–23 నూనెల సీజన్‌లో వంట నూనెల దిగుమతులు 164.7 లక్షల టన్నులకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 24.4 లక్షల టన్నులు పెరిగాయి. ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ నూనెలపై దిగుమతి సుంకం అతి తక్కువగా 5.5 శాతమే ఉండడం ఇందుకు కారణం. దీంతో దేశీయంగా నూనెల సరఫరా అవసరానికి మించి ఎక్కువగా ఉంది’’అని ఎస్‌ఈఏ తెలిపింది.  

దేశీయ పరిశ్రమపై ప్రభావం 
‘‘మొత్తం పామాయిల్‌ దిగుమతుల్లో ఆర్‌బీడీ (రిఫైన్డ్, బ్లీచ్డ్, డియోడరైజ్డ్‌) పామోలీన్‌ ఆయిల్‌ దిగుమతులు 25 శాతంగా ఉన్నాయి. ఇది దేశీయ రిఫైనింగ్‌ పరిశ్రమను గణనీయంగా దెబ్బతీస్తోంది. స్థాపిత సామర్థ్యాన్ని దేశీయ రిఫైనింగ్‌ కంపెనీలు పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది’’అని ఎస్‌ఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. 2022–23 సంవత్సరంలో వంట నూనెల దిగుమతుల విలువ రూ.1.38 లక్షల కోట్లుగా ఉంది. 2021–22లో ఇది రూ.1.57 లక్షల కోట్లు కాగా, 2020–21లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉంది.

నవంబర్‌ 1 నాటికి పోర్టుల్లో 33 లక్షల టన్నుల నూనెల నిల్వలు ఉన్నాయి. ఆర్‌బీడీ పామాయిల్‌ దిగుమతులు 2022–23 సీజన్‌లో 21.1 లక్షల టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు సీజన్‌లో 18.4 లక్షల టన్నుల కంటే ఇది ఎక్కువ. క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతులు 54.9 లక్షల టన్నుల నుంచి 75.9 లక్షల టన్నులకు చేరాయి. క్రూడ్‌ పామ్‌ కెర్నెల్‌ ఆయిల్‌ దిగుమతులు 94,148 టన్నులుగా ఉన్నాయి. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతులు గత సీజన్‌కు 30 లక్షల టన్నులుగా ఉన్నాయి.

అంతకుముందు సంవత్సరంలో 19.4 లక్షల టన్నులుగా ఉండడం గమనించొచ్చు. జూన్‌ 15 వరకు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతులపై పన్ను సున్నా స్థాయిలో ఉండడం కలిసొచ్చింది. దీని ఫలితంగా సోయాబీన్‌ ఆయిల్‌ దిగుమతులు 41.7 లక్షల టన్నుల నుంచి 36.8 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి.     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top