ఈ కామర్స్‌.. 3 లక్షల కోట్లకు!

India Value E-Commerce Market To Touch 40 Billion Dollars By 2030 - Sakshi

2030 నాటికి చేరే అవకాశం... 

కెర్నే నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో ఈ కామర్స్‌ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. 2019 నాటికి 4 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్‌ (రూ.30వేల కోట్లు).. 2030 నాటికి 40 బిలియన్‌ డాలర్ల (రూ.3లక్షల కోట్లు)కు వృద్ధి చెందుతుందని కెర్నే సంస్థ అంచనా వేసింది. ‘ఈ కామర్స్‌: భారత రిటైల్‌ మార్కెట్లో తదుపరి పెద్ద అడుగు’ అంటూ ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. డిజిటల్‌ చానల్స్‌ టైర్‌–3, 4 పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు చేరువ అవుతుండడం.. ఆన్‌లైన్‌ కొనుగోళ్ల దిశగా వినియోగదారుల్లో మారుతున్న ధోరణులు ఈ కామర్స్‌ విస్తరణకు దోహదపడనున్నట్టు ఈ సంస్థ భావిస్తోంది. లైఫ్‌ స్టయిల్‌ రిటైల్‌ మార్కెట్‌ సైతం 2019 నాటికి ఉన్న 90 బిలియన్‌ డాలర్ల నుంచి 2026 నాటికి 156 బిలియన్‌ డాలర్లకు, 2030 నాటికి 215 బిలియన్‌ డాలర్లకు పెరగనున్నట్టు అంచనా వేసింది.

వస్త్రాలు, పాదరక్షలు, యాక్సెసరీలు, కాస్మొటిక్స్‌ ఈ విభాగంలోకే వస్తాయి. ‘‘భారత్‌లో రిటైల్‌ రంగం కరోనా నుంచి కోలుకుంటోంది. విలువ ఆధారిత ఆన్‌లైన్‌ షాపర్లు పెరుగుతుండడం భారత ఈ కామర్స్‌ రూపాన్నే మార్చేయనుంది. లైఫ్‌స్టయిల్‌ విభాగం చాలా వేగంగా వృద్ధి చెంది 2030 నాటికి 215 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది’’ అని కెర్నే పార్ట్‌నర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విభాగంలోని డిమాండ్‌లో 4 శాతాన్నే ఆన్‌లైన్‌ వేదికలు తీరుస్తుండగా. 2030 నాటికి 19 శాతానికి ఇది పెరుగుతుందని అంచనా వేసింది.

ఇంటర్నెట్‌ యూజర్లలో వృద్ధి 
‘‘భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 2026 నాటికి 110 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో మూడింట ఒక వంతు మంది చురుగ్గా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే వారే ఉంటారు’’ అని కెర్నే తన నివేదికలో వివరించింది. ప్రస్తుతానికి లైఫ్‌స్టయిల్‌ రిటైల్‌ డిమాండ్‌లో 70 శాతం విలువ ఆధారిత ఉత్పత్తుల నుంచే ఉంటోందని వివరించింది. ఈ మార్కెట్‌లో 80 శాతం వాటా ప్రస్తుతం అసంఘటిత రంగంలోను, 4 శాతం వాటా ఈ కామర్స్‌ సంస్థలకు ఉండగా.. 2030 నాటికి అసంఘటిత రంగం వాటా 57 శాతానికి తగ్గుతుందని.. అదే సమయంలో ఈ కామర్స్‌ వాటా 19 శాతానికి విస్తరిస్తుందని అంచనాలు ప్రకటించింది.  

2026 నాటికి 140 బిలియన్‌ డాలర్లు 
భారత ఈ–రిటైల్‌ (ఈకామర్స్‌/ఆన్‌లైన్‌) మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోందని.. 2026 మార్చి నాటికి 120–140 బిలియన్‌ డాలర్లకు విస్తరిస్తుందని బెయిన్‌ అండ్‌ కంపెనీ సైతం అంచనాలను ప్రకటించింది. 2020–21లో రిటైల్‌ మార్కెట్‌ మొత్తం మీద 5 శాతం తగ్గినప్పటికీ.. ఈ–రిటైల్‌ మార్కెట్‌ 25 శాతం వృద్ధితో 38 బిలియన్‌ డాలర్లకు విస్తరించినట్టు తెలిపింది. ‘‘2021 చివరికి మొత్తం రిటైల్‌లో ఈ కామర్స్‌ వాటా 4.6 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఈ రిటైల్‌ మార్కెట్‌ వృద్ధికి దోహదపడింది. భద్రత, సౌకర్యానికి వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. భారత్‌లో లాక్‌డౌన్‌ల సమయంలో నిత్యావసరాలు, పరిశుభ్రత ఉత్పత్తులను ఈకామర్స్‌ సంస్థలు ఇళ్లకు చేరవేశాయి’’ అని ఈ సంస్థ పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top