టాప్‌ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్‌! | Sakshi
Sakshi News home page

టాప్‌ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్‌!

Published Thu, May 23 2024 3:07 PM

India stands out top steel producing nations in the world in april

ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తి చేసే టాప్‌ 5 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే వృద్ధి నమోదైనట్లు ప్రపంచ స్టీల్‌ అసోసియేషన్‌(డబ్ల్యూఎస్‌ఏ) నివేదిక వెల్లడించింది. స్టీల్‌ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనా ఏప్రిల్‌ నెలలో 85.9 మిలియన్‌ టన్నులతో 7 శాతం క్షీణించినట్లు డబ్ల్యూఎస్‌ఏ తెలిపింది.

డబ్ల్యూఎస్‌ఏ రిపోర్ట్‌ ప్రకారం..ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు చైనా ఉక్కు ఉత్పత్తి 343.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2023తో పోలిస్తే 3% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న భారత్‌ ఏప్రిల్‌లో 3.6% పెరుగుదలతో 12.1 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య 49.5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి 8.5% వృద్ధి సాధించింది. జపాన్, అమెరికా, రష్యాలు మొదటి త్రైమాసికంలో 2-6% క్షీణించాయి. జనవరి-ఏప్రిల్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇండియా మినహా మిగతా నాలుగు అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రొడక్షన్‌ తగ్గింది.

ఇదీ చదవండి: ఏఐతో మరింత అందంగా: రిలయన్స్‌

ఇండియాలో స్టీల్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ ప్రపంచ డిమాండ్ ఇంకా కోలుకోలేదని డేటా సూచిస్తుంది. క్రిసిల్‌ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ సెహుల్ భట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉక్కు వినియోగిస్తున్న రంగాల్లో డిమాండ్‌ తగ్గింది. 2023లో ఐరన్‌ఓర్‌(ముడి ఉక్కు) ఉత్పత్తిలో ఎలాంటి మార్పులులేవు. ఈ ట్రెండ్‌ 2024లోనూ కొనసాగుతుందని అంచనా. ఈ ధోరణి భారతీయ ఉక్కు తయారీదారుల మార్చి త్రైమాసిక ఆదాయాలపై ప్రభావం చూపింది. దేశంలో అధిక ఐరన్‌ఓర్‌ దిగుమతి కారణంగా ధరలు ప్రభావితమయ్యాయి’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement