
11 నెలల గరిష్టానికి కార్యకలాపాలు
జూలైలో 60.5కు చేరిన సర్వీసెస్ పీఎంఐ సూచీ
న్యూఢిల్లీ: సేవల రంగంలో కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సూచీ జూలైలో 60.5 పాయింట్లకు చేరింది. ఇది 11 నెలల గరిష్ట స్థాయి. మొత్తం మీద విక్రయాలు పెరగడం, కొత్త ఎగుమతి ఆర్డర్లు రావడం బలమైన పనితీరుకు సాయపడ్డాయి. సేవల రంగం పీఎంఐ జూన్ నెలలో 60.4గా ఉండడం గమనార్హం. 50 పాయింట్లకు పైన నమోదైతే విస్తరణగా, అంతకంటే దిగువన ఉంటే బలహీనపడినట్టుగా భావిస్తారు.
సేవల రంగం బలమైన వృద్ధిని నమోదు చేసినట్టు హెచ్‌ఎస్‌బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. కొత్త ఆర్డర్లు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్టు చెప్పారు. సేవలకు అంతర్జాతీయంగా బలమైన డిమాండ్ ఉన్నట్టు సర్వీస్ ప్రొవైడర్లు హెచ్‌ఎస్‌బీసీ నిర్వహించిన నెలవారీ సర్వేలో చెప్పడం గమనార్హం. ఆసియా, కెనడా, యూరప్, యూఏఈ, యూఎస్ ప్రాంతాల నుంచి కొత్త ఆర్డర్లు వచ్చిన్టటు వెల్లడించారు. ఈ ఏడాదికి మిగిలి ఉన్న కాలంలోనూ మెరుగైన పనితీరు నమోదు చేసే విషయమై సర్వీస్ ప్రొవైడర్లు ఆశావహంగా ఉన్నారు.
సామర్థ్యాల పెంపు, మార్కెటింగ్, టెక్నాలజీ ఆవిష్కరణలు, ఆన్‌లైన్‌లో సేవల విస్తరణ బలమైన కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తున్నట్టు హెచ్‌ఎస్‌బీసీ సర్వే పేర్కొంది. జూన్‌తో పోల్చి చూస్తే జూలైలో సర్విస్ ప్రొవైడర్లకు వ్యయాలు పెరిగినట్టు తెలిపింది. ‘‘ఉపాధి కల్పన పరిమితంగానే ఉంది. కాకపోతే దీర్ఘకాల సగటుకు అనుగుణంగానే ఉంది. రెండు శాతం కంటే కొంచెం ఎక్కువ కంపెనీలు అదనపు సిబ్బందిని తీసుకున్నాయి. మిగిలిన కంపెనీల్లో జూన్ నుంచి ఎలాంటి మార్పు లేదు’’అని సర్వే వివరించింది. ఇక హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ సూచీ (తయారీ, సేవలతో కూడిన) జూన్‌లో 61గా ఉంటే జూలైలో 61.1కి చేరింది.