
సేవల రంగంలో కార్యకలాపాల వృద్ధి సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సేవల రంగం పీఎంఐ ఆగస్ట్‌లో 15 ఏళ్ల గరిష్ట స్థాయి 62.9 పాయింట్లకు చేరగా, సెప్టెంబర్‌లో 60.9కు తగ్గింది. అయినప్పటికీ 50 పాయింట్లకు పైన నమోదు కావడాన్ని వృద్ధి కిందే పరిగణిస్తుంటారు. వేగం తగ్గినప్పటికీ, వృద్ధి ధోరణికి ఢోకా లేదని హెచ్‌ఎస్‌బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా భారత సేవలకు డిమాండ్ కొంత నిదానించడంతో వృద్ధి వేగానికి కాస్త బ్రేక్‌లు పడినట్టయింది. సెప్టెంబర్‌లో ఎగుమతుల్లో వృద్ధి నెలకొన్నప్పటికీ, ఈ ఏడాది మార్చి తర్వాత నుంచి చూస్తే తక్కువకు పరిమితమైనట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వే గుర్తించింది. సెప్టెంబర్‌లో ఉపాధి కల్పన సైతం మోస్తరు స్థాయికి నిదానించిందని, కేవలం 5 శాతానికంటే కొంచెం ఎక్కువ కంపెనీలు నియామకాల్లో వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపింది.
ఇక భవిష్యత్తు కార్యకలాపాలకు సంబంధించిన సూచీ మాత్రం ఈ ఏడాది మార్చి తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో వ్యాపార కార్యకలాపాల పరంగా సేవల రంగ కంపెనీల్లో ఆశాభావం బలపడినట్టు ఈ సర్వే పేర్కొంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ (తయారీ, సేవల రంగం కలిపి) 61గా నమోదైంది. ఆగస్ట్‌లో ఇది 63.2 పాయింట్లుగా ఉంది. ఈ ఏడాది జూన్ తర్వాత తక్కువ వృద్ధి రేటు ఇదే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..