Q2GDPgrowth అధిక ధరల సెగ: జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...

India Q2 GDP growth slows to 6.3pc on higher prices - Sakshi

క్యూ2లో వృద్ధి రేటు 6.3 శాతం

ఈ స్థాయి వృద్ధి సాధిస్తున్నఏకైక దేశంగా భారత్‌

2021 సెప్టెంబర్‌ క్వార్టర్‌ కన్నా 2.1 శాతం తక్కువ

2022 జూన్‌ త్రైమాసికంలో వృద్ధితో పోల్చినా భారీ తగ్గుదల

తయారీ, మైనింగ్‌ రంగాల క్షీణత

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022-23, జూలై-సెప్టెంబర్‌) నెమ్మదించింది. 2021-22 ఇదే కాలంతో పోల్చితే జీడీపీ విలువ 6.3 శాతం పెరిగింది. తయారీ, మైనింగ్‌ రంగాల పేలవ పనితీరు ఇందుకు ఒక కారణం. కాగా,  ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో (క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతం కన్నా వృద్ధి వేగం (2.1 శాతం మేర) మందగించడం గమనార్హం.

అయితే, ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను మాత్రం భారత్‌ కొనసాగిస్తోంది. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 3.9 శాతం. భారత్‌ సాధించిన వృద్ధి రేటుకు మరే దేశమూ చేరుకోకపోవడం గమనార్హం. ఇక మొదటి, రెండు త్రైమాసికాలు కలిపి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీడీపీ వృద్ధి రేటు 9.7శాతం, రెండవ త్రైమాసికంలో 6.1-6.3 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనాలకు అనుగుణంగానే బుధవారం విడుదల చేసిన గణాంకాలు ఉండడం గమనార్హం.

6.3 శాతం ఎలా అంటే.. 
2011-12 స్థిర ధరల ప్రాతిపదిక, వాస్తవిక జీడీపీ విలువ 2021-22 క్యూ2లో రూ.35.89 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.38.17 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే వృద్ధి 6.3 శాతమన్నమాట.   

వివిధ రంగాల తీరిది
స్థూల విలువ జోడింపు (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌- జీవీఏ) ప్రాతిపదికన క్యూ2 వృద్ధి రేటు మాత్రం 5.6శాతం పెరిగి రూ.35.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది.
వ్యవసాయం:  ఆర్థిక వ్యవస్థలో 15శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2శాతం .  
తయారీ: ఈ రంగం జీవీఏ మాత్రం 5.6 శాతం (2021 ఇదే కాలంలో) వృద్ధి నుంచి 4.3 శాతం పడిపోయింది.  
మైనింగ్‌: ఈ విభాగం కూడా 2.8 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2021 ఇదే కాలంలో ఈ రంగం వృద్ధి రేటు భారీగా 14.5 శాతంగా ఉంది.  
నిర్మాణం: వృద్ధి 8.1శాతం  నుంచి 6.6శాతానికి తగ్గింది. 
యుటిలిటీ సేవలు: విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల వృద్ధి రేటు 5.6 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.5 శాతంగా నమోదైంది. 
సేవలు: మొత్తం జీడీపీలో మెజారిటీ వాటా కలిగిన ఈ విభాగం చూస్తే (ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్‌) వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 14.7 శాతానికి చేరింది.జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...ఎకానమీ పరుగుకు ఢోకా లేదు!   

అక్టోబర్లో 20 నెలల  కనిష్టానికి మౌలికం  
అక్టోబర్‌లో ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం వృద్ధి రేటు 20 నెలల కనిష్టానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వృద్ధి కేవలం 0.1శాతం గా నమోదయ్యింది. క్రూడ్‌ ఆయిల్, నేచురల్‌ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, సిమెంట్‌ రంగాలు క్షీణతను నమోదు చేసుకున్నాయి. ఎరువుల రంగం మాత్రం 5.4శాతం పురోగతి సాధించింది.  బొగ్గు విభాగంలో 3.6 శాతం, స్టీల్‌ రంగంలో 4శాతం  వృద్ధి నమోదైతే, విద్యుత్‌ ఉత్పత్తి వృద్ధి కేవలం 0.4శాతంగా నమోదైంది.

7 శాతం వరకూ వృద్ధి 
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌  6.8 శాతం 7 శాతం శ్రేణి బాటలో ఉంది. పలు రంగాల్లో రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పండుగల సీజన్‌లో అమ్మకాలు, పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్, బ్యాంక్‌ రుణ వృద్ధి, ఆటో అమ్మకాల గణాంకాలు ఆశావహంగా ఉన్నాయి. -వీ అనంత నాగేశ్వరన్,  చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top