ప్రపంచాభివృద్ధికి జీ20 భారత్‌ ప్రెసిడెన్సీ దిశా నిర్దేశం

India Presidency G20 Direction for Global Development - Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

మంత్రిత్వశాఖలు నిర్వహించిన సెమినార్‌లో ప్రసంగం

న్యూఢిల్లీ: భారత్‌ ప్రెసిడెన్సీలోని జీ20 గ్రూప్‌ ప్రపంచ జనాభాలో మెజారిటీ అవసరాలను పరిష్కరించడానికి స్పష్టమైన విధాన దిశను నిర్దేశించుకున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. బహుళజాతి సదస్సులో పలు దేశాల అవసరాలు, ఎదుర్కొంటున్న సవాళ్లకు సహజంగా చోటుండదని పేర్కొన్న ఆమె, అయితే భారత్‌ నేతృత్వంలో జీ20 భేటీలో ఈ సమస్యను కొంతమేర అధిగమించినట్లు వివరించారు.

అయితే ఈ దిశలో కర్తవ్యం ఇంకా కొంత మిగిలే ఉందని పేర్కొన్నారు. ఆర్థిక, కారి్మక, వాణిజ్య మంత్రిత్వశాఖలు ‘‘బలమైన, స్థిరమైన, సమతుల్య, సమగ్ర వృద్ధిపై ఇక్కడ నిర్వహించిన ఒక సెమినార్‌లో సీతారామన్‌ ప్రారం¿ోపన్యాసం చేశారు. 2022 డిసెంబర్‌ 1వ తేదీన ఏడాది కాలానికి భారత్‌ జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయా అంశాల గురించి సీతారామన్‌ తాజా సెమినార్‌లో మాట్లాడుతూ...

► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను పరిష్కరించాలని, ప్రజలు కేంద్రంగా సంక్షేమ చర్యలు, విశ్వాస ఆధారిత భాగస్వామ్యాలతో  భవిష్యత్తు కోసం విధాన మార్గదర్శకాలను రూపొందించాలని  జీ20 న్యూ ఢిల్లీ లీడర్స్‌ డిక్లరేషన్‌ (ఎన్‌డీఎల్‌డీ)లో గ్రూప్‌లో దేశాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరించాయి.  
► ఈ డిక్లరేషన్‌లో పేద దేశాల పురోగతికి పరస్పర సహకారం, సాంకేతిక పురోగతి నుంచి  ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయోజనం పొందడం, ప్రపంచ పురోగతికి బహుళజాతి సంస్థలు తగిన విధాన చర్యలు చేపట్టడం వంటివి ఇందులో ఉన్నాయి.  
► ఈ నెలాఖరు నాటికి జీ20 అధ్యక్ష స్థానంలో భారత్‌ పాత్ర ముగిసిపోతున్నప్పటికీ, డిక్లరేషన్‌లోని విధాన మార్గదర్శకాల అమలును వేగాన్ని కొనసాగించాలి.
► మహమ్మారి నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సంక్షోభాలతో సతమతమవుతోంది. ప్రపంచ వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. రికవరీ జరుగుతున్నప్పటికీ, ఇది నెమ్మదిగా అసమానంగా ఉంటోంది.
► ప్రపంచ వృద్ధి ప్రస్తుత వేగం చాలా బలహీనంగా ఉంది. వృద్ధి రేటు మహమ్మారికి ముందు రెండు దశాబ్దాలలో సగటు 3.8 శాతం కంటే చాలా తక్కువగా ఉంది. మధ్యస్థ కాలానికి సంబంధించి, వృద్ధి అవకాశాలు మరింత బలహీనపడ్డాయి.    
► వృద్ధి తిరిగి తగిన బాటకు రావడానికి– బలంగా, స్థిరంగా, సమతుల్యంగా కొనసాగడానికి దేశీయంగా, అంతర్జాతీయంగా పరస్పర సహకారం, సమన్వయం కీలకం.  

వేగంగా పురోగమిస్తున్న విమానయానం
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో న్యూఢిల్లీలో బోయింగ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సలీల్‌ గుప్తే,  బోయింగ్‌ ఇండియా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ప్రవీణా యజ్ఞంభట్‌ సమావేశం అయ్యారు. దాదాపు 7% వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్‌ విమానయానరంగం అభివృద్ధి చెందుతోందని సలీల్‌ గుప్తే ఈ సందర్భంగా పేర్కొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. భారతదేశం స్థూలదేశీయోత్పత్తి జీడీపీ వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో.. విమానయాన రంగ పురోగతి కూడా దేశంలో అంతే వేగంగా పురోగమించే అవకాశం సుస్పష్టమని పేర్కొన్నారు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్‌ ఉందన్నారు. ఈ రంగంలో ప్రధాన మౌలిక సదుపాయాల పెరుగుదల, విమాన సేవల విస్తరణ బాటన పటిష్టంగా కొనసాగుతోందన్నారు.   
సమగ్ర వృద్ధిపై ఇక్కడ నిర్వహించిన ఒక సెమినార్‌లో ఆర్థికమంత్రి తదితర సీనియర్‌ అధికారులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top