పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాన్యులపై దాని ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంక్షోభం వల్ల ఏర్పడే సవాళ్లను ఎదుర్కోవడానికి మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారు. ఈ సమావేశానికి హోం, రక్షణ, ఆర్థిక శాఖల మంత్రులతో సహా మొత్తం 13 మంది మంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏకతాటిపై పని చేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు.
ఆహార, ఇంధన భద్రతపై ప్రత్యేక దృష్టి
పశ్చిమాసియా పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సామాన్యుడి అవసరాలకు విఘాతం కలగకుండా కొన్ని అంశాలపై వివరణాత్మక సమీక్ష నిర్వహించారు.
ముడి చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడటంపై చర్చించారు. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న బఫర్ స్టాక్ వల్ల ప్రస్తుతానికి ఇబ్బంది లేదని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
ఆహార భద్రతకు ఎటువంటి ముప్పు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
దిగుమతుల వైవిధ్యం - ఎగుమతుల విస్తరణ
రసాయనాలు, ఫార్మాసూటికల్స్, పెట్రోకెమికల్స్ వంటి కీలక పారిశ్రామిక రంగాలకు అవసరమైన ముడి పదార్థాల కోసం కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా, దిగుమతి వనరులను వైవిధ్యీకరించాలని సమావేశం నిర్ణయించింది. అలాగే, భారతీయ వస్తువుల కోసం కొత్త ఎగుమతి గమ్యస్థానాలను వేగంగా అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారు.
రాష్ట్రాలతో సమన్వయం..
ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని మోదీ ఆదేశించారు. ‘నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై, బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి’ అని ప్రధాని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?


