మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? | How Discipline Patience Smart Investing Create Your Second Income | Sakshi
Sakshi News home page

మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?

Mar 23 2026 8:15 AM | Updated on Mar 23 2026 8:15 AM

How Discipline Patience Smart Investing Create Your Second Income

ప్లానింగ్‌తోనే విజయం సాధ్యం

సరైన ఆలోచనకు క్రమశిక్షణ, ఓర్పు తోడైతే విజయం మీదే

రిస్క్‌ను తెలుసుకుని, నిపుణుల సూచనలతో ముందుకెళ్లాలి

‘వెల్త్‌’ కోసం ఫైనాన్షియల్‌ ప్లానర్ల సలహాలు ఇవీ..

చాలామందికి ఆదాయం అంటే నెల జీతం మాత్రమే. పెట్టుబడులను కూడా ఖర్చుల్లానే చూస్తుంటారు. భవిష్యత్తు ఆదాయానికి పెట్టుబడులే ప్రధానమన్న సూత్రాన్ని పెద్దగా పట్టించుకోరు. వారెన్‌ బఫెట్‌ మాటల్లో చెప్పాలంటే రెండో ఆదాయమనేది పెట్టుబడులతోనే వస్తుంది. మరి పెట్టుబడుల్లో సక్సెస్‌ కావాలంటే.? దీనికి పెద్ద పరిజ్ఞానం అవసరం లేదు. కావాల్సిందల్లా సరైన ఆలోచన... క్రమశిక్షణ, ఓర్పు. ఈ మూడింటితో పెట్టుబడులను సరైన దారిలో కొనసాగించడం, సమయానికి మార్పులు చేయడం, దీర్ఘకాలం కొనసాగించటం చేయొచ్చు. అదే సంపద సృష్టికి మార్గం. నిజానికి చాలా మంది ఇన్వెస్టర్లు తొలుత ఉత్సాహంగా పెట్టుబడులు మొదలెడతారు. కొన్నాళ్లకు నిర్లక్ష్యం చేస్తారు. ఇదే వారి వైఫల్యానికి ప్రధాన కారణం. పెట్టుబడుల్లో విజయానికి ఫైనాన్షియల్‌ ప్లానర్లు ప్రత్యేకంగా చెబుతున్న సూత్రాలను వివరించేదే ఈ ‘వెల్త్‌ స్టోరీ’...

ముందుగా తెలుసుకోవటం... తరవాతే ఇన్వెస్ట్‌మెంట్‌

చాలామంది ఇతరులు చెప్పారని, సోషల్‌ మీడియాలో చూశామని,  ఇది బాగా లాభాలిస్తుందని ఎవరో చెబితే విన్నామని పెట్టుబడులు పెడతారు. ఇదే మొదటి పెద్ద తప్పు. మీరు దేనిలో పెట్టుబడి పెడుతున్నారో దాని గురించి బాగా తెలుసుకోవాలి. అది ఎలా పనిచేస్తుంది? అందులో  రిస్క్‌ ఎంత? రిటర్న్స్‌’ ఎన్నాళ్లకు వస్తాయి? మీ లక్ష్యాలకు ఇది సరిపోతుందా? ఇవన్నీ సరిచూసుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్సూరెన్స్, డెట్‌ ఫండ్స్, ఈక్విటీ వంటి వాటి లక్షణాలు, లాభాలు, రిసు్కలు తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టకూడదు. తెలియని దాంట్లో పెట్టుబడి పెట్టకూడదన్నది తొలి నియమం.

మీ రిస్క్‌ సామర్థ్యాన్ని మీరే తెలుసుకోండి

అందరూ ఒకే రకమైన ఇన్వెస్టర్లు కాదు. కొంతమంది అధిక రిస్క్‌ తీసుకోగలుగుతారు. మరికొందరు అస్సలు రిస్క్‌ తీసుకోలేరు. ఇది ప్రధానంగా వారి ఆర్థిక స్థాయిలను బట్టి మారుతుంటుంది. మీరు తట్టుకోలేని స్థాయిలో రిస్క్‌ తీసుకుంటే... మార్కెట్‌లో సంభవించే చిన్న చిన్న మార్పులకే భయపడతారు. అప్పుడు ఆందోళనతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని, నష్టాల్లో కూరుకుపోతారు.  మంచి ఇన్వెస్టర్‌ అంటే భయంలేని వాడు కాదు. తన సామర్థ్యాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్‌ చేసేవాడు.

ఉచిత సలహాలకు విలువ ఉండదు

ఉచితంగా లభించే విషయాలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఫైనాన్స్‌ విషయంలోనూ అదే జరుగుతుంది. కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే నష్టం మాత్రం చాలా ఖరీదైనదిగా మారుతుంది, ఒక్కోసారి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఒక మంచి ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ మీ అవసరాలు, లక్ష్యాలు, రిస్క్‌ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని సరైన మార్గాన్ని నిర్దేశిస్తాడు., అవసరమైన సందర్భాల్లో పోర్ట్‌ఫోలియోలో మార్పులు కూడా సూచిస్తాడు. పెయిడ్‌ అడ్వైజర్‌ని సంప్రదించడం ఖర్చు కాదు. భవిష్యత్తు పెట్టుబడుల్లో భాగం.

లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టండి

లాభాలు వచ్చినప్పుడు వాటిని మొత్తం ఖర్చు చేయకండి. కొంత భాగాన్ని మళ్లీ పెట్టుబడుల్లో పెట్టండి. దీనివల్ల లాభాలపై మళ్లీ లాభాలు వస్తాయి. ఇదే నిజమైన సంపద రహస్యం.  

సరైన అసెట్‌ అలొకేషన్‌

మీ పెట్టుబడులపై ఎంత రాబడి వస్తుందనేది మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టారనేదానిపై ఆధారపడి ఉంటుంది. దీన్నే అసెట్‌ అలొకేషన్‌గా చెబుతుంటారు. ఈక్విటీ, డెట్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, గోల్డ్‌ వంటి విభాగాల్లో మీ డబ్బును సరైన శాతాల్లో పెట్టుబడి చేయడమే ఈ అసెట్‌ అలొకేషన్‌. మీ వయస్సు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యం , మీ లక్ష్యాలు వాటి కాల వ్యవధి మీద ఇది ఆధారపడి ఉంటుంది. యువ ఇన్వెస్టర్లు  రిస్క్‌ ఎక్కువ తీసుకోగలరు. అందుకే ఈక్విటీల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ భద్రత ముఖ్యం అవుతుంది. అప్పుడు డెట్‌లో పెట్టుబడికి ప్రాధాన్యమివ్వాలి. ఎవరైనా మొత్తం డబ్బు ఒకే చోట పెట్టడం ప్రమాదకరం.

మీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ మాట వినండి

మీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ మీ పెట్టుబడులను పర్యవేక్షిస్తుంటారు. మార్కెట్‌ ట్రెండ్స్‌ను గమనిస్తుంటారు. వారు ఇచ్చే సూచనలను నిర్లక్ష్యం చేయకుండా, ఆలోచించి అమలు చేయడం మంచిది. ఫైనల్‌ నిర్ణయం మీరే తీసుకున్నా..  వారి అనుభవం పెట్టుబడుల విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది.

మార్కెట్‌ ఊగిసలాటలు సహజమే

మార్కెట్‌ ఎప్పుడూ పైకి మాత్రమే వెళ్లదు. అప్పుడప్పుడూ పడిపోతుంది. కానీ మళ్లీ పెరుగుతుంది. ఇది సహజ ప్రక్రియ. చిన్న మార్పులకు భయపడి పెట్టుబడులు ఉపసంహరించుకుంటే, మీరు నష్టాలకే బాట వేస్తారు. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయనే విషయం చరిత్ర చెబుతోంది. పెట్టుబడుల విషయంలో ఓర్పు ఇన్వెస్టర్‌కు అత్యంత ముఖ్యమైన ఆయుధం.

పెట్టుబడులూ ప్రధానమే..

మనందరికీ కుటుంబం ముఖ్యం. పని ముఖ్యం. కానీ పెట్టుబడులూ అంతే ముఖ్యమని తెలు సుకోవాలి. ఎందుకంటే ఇవే మీ భవిష్యత్తును కాపాడతాయి. చాలామంది చేసే తప్పేంటంటే ముందుగా ఖర్చులు చేస్తారు, మిగిలితే ఇన్వెస్ట్‌ చేస్తారు. స్మార్ట్‌ ఇన్వెస్టర్లు చేసే పని ముందుగా ఇన్వెస్ట్‌ చేయడం. తర్వాత ఖర్చులు ప్లాన్‌ చేసుకోవటం. ఇది చిన్న మార్పులా అనిపించినా, దీర్ఘకాలంలో సంపద సృష్టికి పెద్ద ఆధారమవుతుంది.

దీర్ఘకాలిక లక్ష్యాలను ఎప్పుడూ మరవద్దు

పిల్లల చదువు, రిటైర్మెంట్, ఇల్లు కొనడం లాంటి లక్ష్యాలు 10–15 సంవత్సరాల తర్వాత వచ్చే దీర్ఘకాలిక లక్ష్యాలు. ఇవి సమయం మీద ఆధారపడే లక్ష్యాలు. సమయం అంటే కాంపౌండింగ్‌ శక్తి. ఈ డబ్బును చిన్న అవసరాలకు వాడితే మీరు కోల్పోయేది కేవలం డబ్బు కాదు. అంతకంటే విలువైన సమయం. డబ్బు మళ్లీ సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేరు.

పెట్టుబడులు చేయడం అలవాటు చేసుకోండి

విజయవంతమైన ఇన్వెస్టర్లు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టరు. క్రమ పద్ధతిలో పెట్టుబడులు చేస్తుంటారు. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (సిప్‌) వంటి పద్ధతులు మీలో క్రమశిక్షణను పెంచుతాయి. చిన్న మొత్తాలతో మొదలుపెట్టినా, కాలక్రమంలో అవి పెద్ద మొత్తాలుగా మారతాయి.

పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్‌ చేయాలి

మార్కెట్‌ మారుతుంది. మీ జీవితం కూడా మారుతుంది. కొత్త లక్ష్యాలు వస్తాయి, పాత లక్ష్యాలు పూర్తవుతాయి. ఈ మార్పులకు అనుగుణంగా మీ పెట్టుబడుల్లో కూడా మార్పులు చేయాలి. దీన్నే పెట్టుబడుల పరిభాషలో రీ–బ్యాలెన్సింగ్‌ అంటారు.ఉదాహరణకు పిల్లల చదువుకు చేసిన పెట్టుబడులు పూర్తయ్యాక, ఆ డబ్బును రిటైర్మెంట్‌ లక్ష్యానికి మళ్లించాలి.

ఇదీ చదవండి: ‘జీడి’ రైతుకు కొత్త ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement