సాధారణంగా జీడి తోటలంటే కేవలం జీడిపిక్కల కోసమేననే భావన రైతుల్లో బలంగా ఉంది. కానీ, ఆ పిక్కకు అనుబంధంగా ఉండే ‘జీడిపండు’ రైతు ఆర్థిక స్థితిగతులను మార్చేయగల అద్భుత శక్తి అని వ్యవసాయ రంగ నిపుణులు నొక్కి చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా లక్షలాది టన్నుల జీడిపండు వృథాగా నేలపాలవుతోందని, దీన్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పుత్తూరులోని ఐకార్-జీడి పరిశోధన డైరెక్టరేట్ (డీసీఆర్) నిర్వహించిన పరిశ్రమల ముఖాముఖి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది.
గణాంకాలు ఇలా..
డీసీఆర్ డైరెక్టర్ జె.దినకర అడిగా సమర్పించిన వివరాల ప్రకారం, దేశంలో జీడిపండు వినియోగం అత్యల్పంగా ఉంది. భారతదేశంలో ఏటా సుమారు 60 లక్షల టన్నుల జీడిపండు ఉత్పత్తి అవుతోంది. ఇందులో కేవలం 1 శాతం మాత్రమే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి వాడుతున్నారు. ఒక హెక్టారు జీడి తోటలో సగటున 1 టన్ను జీడిపిక్కలు లభిస్తే ఏకంగా 8 టన్నుల జీడిపండు లభిస్తుంది. అంటే మనం ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న పిక్కల కంటే 8 రెట్లు ఎక్కువగా పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన, సాంకేతికత లేక వాటిని వృథా చేస్తున్నాం. జీడిపండు నుంచి రసం తీసిన తర్వాత మిగిలే పిప్పితోనూ ఆదాయం పొందే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.
కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ సహకారంతో జీడిపండు పిప్పి పొడితో చేపల మేతను తయారు చేసే సాంకేతికతను డీసీఆర్ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే స్వచ్ఛమైన జీడిపండు రసం, పాశ్చరైజ్డ్ జ్యూస్, లిక్విడ్ స్వీటెనర్, జీడిపండు పిప్పి టీ వంటి వినూత్న ఉత్పత్తుల సాంకేతికతను డైరెక్టరేట్ సిద్ధం చేసింది.
బ్రెజిల్ ఆదర్శం
బ్రెజిల్ వంటి దేశాల్లో జీడిపండును అత్యధికంగా వినియోగించుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. భారతదేశంలో చిన్న స్థాయిలోనైనా ఈ ప్రయత్నం మొదలుపెడితే భవిష్యత్తులో ఇది పెద్ద పరిశ్రమగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రభుత్వ సంస్థలు తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను బదిలీ చేసేటప్పుడు వసూలు చేసే రాయల్టీలు స్టార్టప్‌లను నిరుత్సాహపరిచేలా ఉండకూడదు. నామమాత్రపు ధరలకే సాంకేతికతను అందిస్తే యువత ఈ రంగంలోకి వస్తారు’ అని చెబుతున్నారు.
కేవలం జీడిపిక్కల అమ్మకానికే పరిమితం కాకుండా జీడిపండును కూడా ఒక వాణిజ్య పంటగా గుర్తిస్తే రైతులకు ఇది బోనస్ ఆదాయం అవుతుంది. ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త ఊపిరి పోయడం ఖాయం.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


