జీడీపీ క్రాష్‌! | Sakshi
Sakshi News home page

జీడీపీ క్రాష్‌!

Published Tue, Sep 1 2020 5:01 AM

India GDP shrinks by 23percent in first quarter - Sakshi

న్యూఢిల్లీ: కరోనా విలయతాండవంతో భారత ఎకానమీ కుప్పకూలింది. ఆర్థిక విశ్లేషకులు, సంస్థలు, విధాన నిర్ణేతల అంచనాలకు మించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌)  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి జారిపోయింది.  గత ఏడాది కాలంతో పోలిస్తే, అసలు వృద్ధిలేకపోగా మైనస్‌ 23.9 శాతం క్షీణించింది.

కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్‌డౌన్‌ దీనికి ప్రధాన కారణం. గడిచిన 40 ఏళ్లలో దేశ  జీడీపీ మళ్లీ మైనస్‌లోకి జారిపోవడం ఇదే తొలిసారి కాగా, చరిత్రలో ఇంతటి ఘోర క్షీణత నమోదవడం కూడా మొట్టమొదటిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో దేశంలో పడిపోయిన పెట్టుబడులు, వినియోగం పరిస్థితులను కరోనా వైరస్‌ మరింత కుంగదీసింది.

జనవరి–మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 3.1% అయితే 2019 ఇదే త్రైమాసికంలో 5.2%. అధికారికంగా సోమవారం విడుదలైన జీడీపీ లెక్కను పరిశీలిస్తే, త్రైమాసిక గణాంకాలు ప్రారంభమైన 1996 నుంచీ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణ పతనం ఇదే తొలిసారి. వ్యవసాయ రంగం ఒక్కటే గణాంకాల్లో కొంత ఊరటనిచ్చింది. మిగిలిన దాదాపు అన్ని రంగాల్లో క్షీణ ధోరణి కనిపించింది.  2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఆర్థిక వ్యవస్థపై అంచనాలు వేయడం క్లిష్టమైన వ్యవహారమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో అస్పష్ట ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని పేర్కొంది.  అయితే క్షీణ రేటు మైనస్‌ 15–20% ఉంటుందని పలు విశ్లేషణా సంస్థలు అంచనావేస్తున్నాయి.

విలువల్లో చూస్తే...
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్‌ఎస్‌ఓ), గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.35.35 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.26.90 లక్షల కోట్లు. వెరసి మైనస్‌ –23.9 శాతం క్షీణ రేటు నమోదయ్యిందన్నమాట. ఇక కేవలం వస్తు ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) ప్రకారం జీడీపీ విలువ రూ.33.08 లక్షల కోట్ల నుంచి రూ.25.53 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ విలువ మైనస్‌ 22.8% క్షీణించిందన్నమాట.  

వ్యవ‘సాయం’ ఒక్కటే ఊరట
► వ్యవసాయం:  వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది.  
►  ఫైనాన్షియల్, రియల్టీ, వృత్తిపరమైన సేవలు:  మైనస్‌ 5.3% క్షీణించింది.  
► పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు:   క్షీణత రేటు మైనస్‌ 10 శాతంగా ఉంది.
► వాణిజ్యం, హోటల్స్‌ రవాణా, కమ్యూనికేషన్లు: ఈ విభాగాలు ఎన్నడూ లేనంతగా మైనస్‌ 47 శాతం పతనమయ్యాయి.  
► తయారీ:  మైనస్‌ 39.3% కుదేలైంది.  
► నిర్మాణం: మైనస్‌ 50.3% కుప్పకూలింది.  
► మైనింగ్‌: మైనస్‌ 23.3% క్షీణించింది.  
► విద్యుత్, గ్యాస్‌: క్షీణత మైనస్‌ 7%.

ఊహించని షాక్‌ వల్లే...
అంతర్జాతీయంగా ప్రతి దేశాన్నీ షాక్‌కు గురిచేసిన కరోనా వైరస్‌ ప్రభావమే తొలి త్రైమాసిక భారీ క్షీణ ఫలితానికి కారణం. జీడీపీ తలసరి ఆదాయం 1870 తరువాత ఎన్నడూ చూడని క్షీణ రేటును చూసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలూ లాక్‌డౌన్‌ పరిస్థితి నుంచి బయటపడ్డాక, వృద్ధి ‘వీ’ షేప్‌లో ఉండొచ్చు.  
– కేవీ సుబ్రమణియన్, చీప్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌
 
రికవరీ ఉంటుందని భావిస్తున్నాం...
ఊహించిన విధంగానే క్షీణత భారీగా ఉంది. లాక్‌డౌన్‌ ప్రభావిత అంశాలే దీనికి ప్రధాన కారణం. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలూ బలహీన పరిస్థితి ఉన్నా, క్రమంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతుందని భావిస్తున్నాం. కేంద్రం,  ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానాలు ఇందుకు దోహదపడతాయని భావిస్తున్నాం.
– చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌

కుదుట పడుతుంది...
రానున్న త్రైమాసికాల్లో క్షీణ రేట్లు క్రమంగా దిగివస్తాయి. లాక్‌డౌన్‌ కఠిన పరిస్థితులు  తొలగుతుండడం దీనికి కారణం.   కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్, ఆర్‌బీఐ చొరవలు పరిస్థితిని కుదుటపడేస్తాయని భావిస్తున్నాం.
– నిరంజన్‌ హీరనందాని, అసోచామ్‌ ప్రెసిడెంట్‌

1950–51 జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు అంటే.. 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్‌ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. స్వాతంత్య్రానంతరం 1958, 1966, 1980లో చోటుచేసుకున్న మూడు మాంద్యాలకూ ప్రధాన కారణాల్లో ఒకటి తగిన వర్షపాతం లేకపోవడమే.
 

Advertisement
 
Advertisement
 
Advertisement