ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఎకానమీ గ్రోత్‌ ఎంతంటే!

India Economic Growth In Financial Year Is Estimated To Be 8% - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఎకానమీ ప్రస్తుత  ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.5 శాతం నుంచి 8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు పారిశ్రామిక వేదిక– సీఐఐ ప్రెసిడెంట్‌ టీవీ నరేంద్రన్‌ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధిలో  ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయని కూడా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నరేంద్రన్‌ అభిప్రాయం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 7.2 శాతం అంచనాలకన్నా అధికంగా ఉండడం గమనార్హం. 

ఏప్రిల్‌ మొదటి వారంలో జరిగిన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఆర్‌బీఐ ఏకంగా 60 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించిన సంగతి తెలిసిందే.  దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి దిగివచ్చింది. ఈ నేపథ్యంలో ఎకానమీపై సీఐఐ ప్రెసిడెంట్‌ అభిప్రాయాలు ఇవీ... 

కోవిడ్‌–19 మహమ్మారి తదుపరి వేవ్‌ను, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావాలను తట్టుకోడానికి దేశం సిద్ధంగా ఉండాలి. ఈ సవాళ్లను దేశం ఎదుర్కొంటుందన్న భరోసా ఉంది.  తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి పథాన్ని నిలుపుకోగలదని మేము విశ్వసిస్తున్నాము. ప్రత్యేకించి ఎగుమతి విషయంలో మేము చాలా ఆశాజనకంగా ఉన్నాము. భారతదేశ పురోగతిలో ఎగుమతులు కీలక భాగమవుతాయి.  

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తాజా సవాళ్లు ప్రపంచ సప్లై చైన్‌పై ప్రభావం చూపుతుంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనా 7.5–8 శాతం ఉంటుందని భావిస్తున్నాం.  

 కోవిడ్‌ సవాళ్లకు సంబంధించి అనుభవాలు చూస్తే, ప్రపంచవ్యాప్తంగా కొత్త వేవ్‌ ఉన్న ప్రతిసారీ, అది భారతదేశాన్ని కూడా తాకుతుంది. కాబట్టి, భవిష్యత్తులో వచ్చే వేవ్‌లను ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా ఉండాలి. 

కోవిడ్‌ను ఎదుర్కొనడానికి పరిశ్రమ పటిష్ట రక్షణాత్మక ప్రోటోకాల్‌లను కలిగి ఉంది.  మహమ్మారి నిర్వహణలో అలాగే ఇన్‌ఫెక్షన్లు పెరిగినప్పటికీ సురక్షితంగా పనిచేయడంలో సామర్థ్యానికి సంబంధించి మంచి అనుభవాన్ని సముపార్జించింది.  

► గతంలో మైక్రో–కంటైన్‌మెంట్‌ (తక్కువ పరిధిలో ఆంక్షలు) వ్యూహం భారతదేశానికి బాగా పనిచేసింది. మళ్లీ భారీగా లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉండబోదని పరిశ్రమ విశ్వసిస్తోంది.  

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ను నిర్వహించడంలో విస్తృతంగా ఆమోదించబడిన సూత్రం ఏమిటంటే, కఠినమైన లాక్‌డౌన్‌లకు వెళ్లడం కంటే దానితో జీవించడం నేర్చుకోవడం. దీనిని భారత్‌ అర్థం చేసుకుంది.  

► చమురు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల పరిశ్రమల మార్జిన్లు, వినియోగదారుల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతోంది. అయితే భారతదేశంలో స్టాగ్‌ఫ్లేషన్‌ (ధరలు పెరుగుతూ, వస్తు డిమాండ్‌ పడిపోవడం) వంటి పదాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని విశ్వసిస్తున్నాం.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.5–8 శాతం పరిధిలోనే ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత్‌ 8.2 శాతం వృద్ధి సాధిస్తుందని పేర్కొంటోంది.  ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అంచనా వేస్తోంది. సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్య పరిధిలోనే (2–6 శాతం) ఉంటుందని విశ్వసిస్తున్నాం.  

మహమ్మారి సంబంధిత ఆంక్షలు ఎత్తివేసినందున, వినియోగ డిమాండ్‌ బలంగా పుంజుకుంటోంది.  ముఖ్యంగా కాంటాక్ట్‌–ఇంటెన్సివ్‌ రం గాలలో ఈ పరిస్థితి నెలకొనడం హర్షణీయం.  ప్రపంచ  ఎగుమతుల్లో కోకింగ్‌ కోల్‌ కీలకమైనది. ఈ ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్‌ వాటా దాదాపు 11 శాతం. ఉక్కుకు సంబంధించి కీలకమైన ముడి పదార్థం ఇది. సరఫరా అంతరాయాలు ఈ ఇన్‌పుట్‌ ధర  పెరగడానికి కారణమయ్యాయి, ఇది భారతీయ ఉక్కు తయారీ సంస్థలపై ప్రభావం చూపుతోంది.గ్లోబల్‌ బొగ్గు ధరలు వార్షిక ప్రాతిపదికన ఇప్పటివరకు 400 శాతానికి పైగా పెరిగాయి.  విద్యుత్‌ ఉత్పత్తితో పాటు అనేక తయారీ పరిశ్రమలలో కీలకమైన ముడి పదార్థంగా ఉండటం వల్ల ఆయా రంగాల వ్యయ భారాలు భారీగా పెరిగవచ్చు. 

యుద్ధ ప్రభావాల నుంచి తప్పించుకోలేం... 
యుద్ధ పరిణామాల నుంచి భారత్‌ తప్పించుకోలేదని నరేంద్రన్‌ స్పష్టం చేశారు. ఆయన దీనిపై ఏమన్నారంటే, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావాల గురించి పరిశీలిస్తే, మనం నివసిస్తున్న, పెరుగుతున్న ప్రపంచీకరణ, పరస్పరం అనుసంధానిత  ప్రపంచంలో, ఏ దేశమూ దాని రాజకీయ సరిహద్దుల వెలుపల ఉత్పన్నమయ్యే సంఘటనల నుండి పూర్తిగా రక్షించబడదు. ఈ నేపథ్యంలో రష్యా లేదా ఉక్రెయిన్‌తో భారత్‌ ఆర్థిక సంబంధాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ యుద్ధం  ప్రభావం భారత్‌పై తప్పనిసరిగా ఉం టుంది.  అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మార్చిలో బేరల్‌కు 128 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 100 డాలర్ల పైన కొనసాగుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని, పలు రంగాలలో ఇన్‌పుట్‌ వ్యయ భారాలను పెంచే విషయం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top