
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్
వరుసగా రెండో ఏడాది గుర్తింపు
2024లో 7 లక్షల యూనిట్ల విక్రయాలు
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా భారత్ వరుసగా రెండో ఏడాది గుర్తింపును సొంతం చేసుకుంది. 2024లో వీటి అమ్మకాలు 20 శాతం పెరిగి 7 లక్షల యూనిట్లుగా ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తెలిపింది. ప్రపంచ ఈవీ మార్కెట్‌పై ఐఈఏ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్ మార్కెట్ గురించి కీలకంగా ప్రస్తావించింది.
అంతర్జాతీయంగా త్రిచక్ర ఈవీల వృద్ధిలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా త్రిచక్ర వాహన అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలి్చతే 5 శాతం క్షీణించినప్పటికీ.. తిచక్ర ఈవీల విక్రయాలు మాత్రం 10 శాతం పెరిగి మిలియన్ యూనిట్లను దాటినట్టు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయ త్రిచక్ర వాహనాలతోపాటు త్రిచక్ర ఈవీల్లో 90 శాతం వాటా చైనా, భారత్ చేతుల్లోనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.
‘‘చైనాలో తిచక్ర వాహన అమ్మకాల్లో గత మూడేళ్ల నుంచి ఈవీలు 15 శాతంలోపే ఉంటున్నాయి. 2023లో చైనాను వెనక్కి నెట్టేసి ప్రపంచ అతిపెద్ద తిచక్ర ఈవీ మార్కెట్‌గా భారత్ అవతరించింది. 2024లోనూ 7 లక్షల త్రిచక్ర ఈవీ అమ్మకాలతో అతిపెద్ద మార్కెట్ స్థానాన్ని కాపాడుకుంది’’అని ఈ నివేదిక తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్త త్రిచక్ర ఈవీల అమ్మకాల్లో భారత్ వాటా 57 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 2023తో పోల్చి చూస్తే 3 శాతం వాటాను పెంచుకున్నట్టు తెలిపింది. పీఎం ఈ–డ్రైవ్ పథకం మద్దతును ప్రస్తావించింది. కేంద్ర సర్కారు ఈ పథకం ద్వారా ఈవీలకు సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తుండడం తెలిసిందే.
ద్వి, త్రిచక్ర వాహనాలకు బడా మార్కెట్
అంతర్జాతీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాల్లో చైనా, భారత్, దక్షిణాసియా దేశాలు 80 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఐఈఏ నివేదిక వెల్లడించింది. ప్రైవేటు ప్యాసింజర్ రవాణాకు ఇవి ప్రాథమిక వినియోగంగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఎలక్ట్రిక్ టూవీలర్లకు భారత్ చురుకైన మార్కెట్‌గా ఉంటోంది. 220కు పైగా ఓఈఎంలకు (వాహన తయారీ సంస్థలు) కేంద్రంగా ఉంది. 2023లో ఉన్న 180 కంటే పెరిగాయి. 2024లో మొత్తం ద్విచక్ర ఈవీల అమ్మకాలు 1.3 మిలియన్ యూనిట్లలో 80 శాతం వాటా టాప్–4 కంపెనీలు కలిగి ఉన్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది.
అధిక ధరలు, తీవ్ర పోటీ
సంప్రదాయ ద్విచక్ర వాహనలతో పోల్చి చూసినప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలు ధర అధికంగా ఉన్నట్టు.. అదే సమయంలో పోటీ పెరగడంతో ఓఈఎంలు అందుబాటు ధరలపై మోడళ్లను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఓలా ఎస్1ఎక్స్ మోడల్‌ను నిదర్శనంగా పేర్కొంది. 2కిలోవాట్‌హవర్ బ్యాటరీ, 6కిలోవాట్ పీక్ పవర్ సామర్థ్యంతో 70,000కే అందిస్తున్నట్టు గుర్తు చేసింది.
విధానపరమైన మద్దతు (సబ్సిడీలు) కూడా సంప్రదాయ, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మధ్య ధరల అంతరాన్ని తగ్గిస్తున్నట్టు ఐఈఏ నివేదిక తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2024లో కేవలం 2 శాతం పెరిగి 1,00,000 యూనిట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ఇక ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు క్రితం ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే 45 శాతం పెరిగి 35,000 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది.