
ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థానికంగా ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వాటి ఉత్పత్తులకు ఆదరణ లభిస్తే అపార సంపద చేకూరుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశం, పాకిస్థాన్ అత్యంత ప్రభావవంతమైన సీఈఓలను తయారు చేశాయి. సంపదలో హెచ్చుతగ్గులున్నా ఎవరి ప్రత్యేకత వారిదే. ఇరుదేశాలకు చెందిన ఈ సీఈఓలు తమ కంపెనీల లాభాలను పెంచడమే కాకుండా దేశ వ్యాపార ముఖచిత్రాలను మారుస్తున్నారు. భారత్, పాకిస్థాన్‌కు చెందిన టాప్ సీఈఓలు, వారి నికర ఆస్తులు, వారి పరిశ్రమల వివరాలు కింద తెలుసుకోవచ్చు. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే భారత సీఈఓల సంపద వేలు, లక్షల కోట్లలో ఉంటే.. పాక్ సీఈఓలలో ఒకరిద్దరు మినహా.. మిగిలిన వారి సంపద పదుల కోట్లకే పరిమితం కావడం గమనార్హం.
2025 లెక్కల ప్రకారం ఇండియాలోని టాప్ 5 సీఈఓలు.. వారి నికర ఆస్తులు
1. ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్‌గా ముఖేశ్ అంబానీ ఉన్నారు. 110 బిలియన్ డాలర్ల (రూ.9.1 లక్షల కోట్లు) నికర విలువతో దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. టెలికాం నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు అన్ని రంగాలను అంబానీ శాసిస్తున్నారు.
2. గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన నికర సంపద 56.3 బిలియన్ డాలర్లు(రూ.4.75 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. దేశంలోని ప్రముఖ పోర్ట్స్ దగ్గర నుంచి పవర్ జనరేషన్ వరకు చాలా రంగాల్లో సేవలందిస్తున్నారు.
3. సుందర్ పిచాయ్
ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ. 1.3 బిలియన్ డాలర్లు (రూ.10,800 కోట్లు) సమీకరించారు. తమిళనాడులో జన్మించిన సుందర్ పిచాయ్ గూగుల్ మాతృసంస్థకు నేతృత్వం వహిస్తూ కృత్రిమ మేధ, ఆన్‌లైన్ సెర్చ్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు.
4. సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈఓ. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సంస్థను ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ పవర్‌హైజ్‌గా మార్చారు. అతను 331 మిలియన్ డాలర్ల (రూ.2,750 కోట్లు) నికర విలువను కలిగి ఉన్నారు.
5. ఫాల్గుణి నాయర్
ఫాల్గుణి నాయర్ నైకా అనే బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ రిటైల్ కంపెనీకి సీఈఓ. ఫోర్బ్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా ఉన్నారు. ఆమె నికర ఆస్తుల విలువ 3.64 బిలియన్ డాలర్లు (రూ.30,300 కోట్లు).
ఇదీ చదవండి: రోజూ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు..?
పాకిస్థాన్‌లోని టాప్ 5 సీఈఓలు.. వారి నికర ఆస్తులు
1. షాహిద్ ఖాన్
పాకిస్థానీ-అమెరికన్ వ్యాపార దిగ్గజం ఫ్లెక్స్-ఎన్-గేట్ సీఈఓ షాహిద్ ఖాన్. 13.3 బిలియన్ డాలర్ల (రూ.1.1 లక్షల కోట్లు) సంపదతో పాక్‌లో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. అతను ఎన్ఎఫ్ఎల్ జట్టు జాక్సన్ విల్లే జాగ్వార్స్, ఇంగ్లీష్ క్లబ్ ఫుల్హామ్ ఎఫ్‌సీలకు ఆధిపతిగా ఉన్నారు.
2. మియాన్ ముహమ్మద్ మాన్షా
మాన్షా నిషాత్ గ్రూప్ ఛైర్మన్. 5 బిలియన్ డాలర్ల (రూ.41,500 కోట్లు) నికర విలువతో పాకిస్థాన్ తొలి బిలియనీర్ వ్యాపారవేత్త. అతని వ్యాపార సామ్రాజ్యం బ్యాంకింగ్, టెక్స్‌టైల్స్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తిలో విస్తరించి ఉంది.
3. షాజియా సయ్యద్
యూనిలీవర్ పాకిస్తాన్ సీఈఓ షాజియా సయ్యద్ నికర విలువ 5 మిలియన్ డాలర్లు (రూ.41 కోట్లు). ఆమె నాయకత్వంలో మహిళలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో సుస్థిరత, బ్రాండ్ నమ్మకాన్ని ప్రోత్సహించడంలో గుర్తింపు పొందారు.
4. అసద్ ఉమర్
ఎంగ్రో కార్పొరేషన్ మాజీ సీఈఓ. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఉన్న ఉమర్ విలువ 3 మిలియన్ డాలర్లు (రూ.25 కోట్లు) ఉంటుందని అంచనా.
5. షోయబ్ సిద్ధిఖీ
జాజ్ పాకిస్థాన్ సీఈఓ షోయబ్ సిద్ధిఖీ. ఈయన సంపద 2 మిలియన్ డాలర్లు (రూ.16.5 కోట్లు). దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ సేవలు, మొబైల్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్‌లను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.