
బంగారం తనఖాపై రుణాలు అందించే ఇండెల్ మనీ తన నిర్వహణ ఆస్తులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి (2026 మార్చి) రూ.4,000 కోట్లను పెంచుకోనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణ ఆస్తులు (రుణాలు) రూ.2,400 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల రుణాల మంజూరును సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది.
ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!
గత ఆర్థిక సంవత్సరంలో 89 కొత్త శాఖలు తెరవడంతో మొత్తం 12 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శాఖల సంఖ్య 2025 మార్చి 31 నాటికి 365కు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.61 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఎన్‌పీఏలు గత ఆర్థిక సంవత్సరం చివరికి 1.35 శాతానికి తగ్గాయి. అంతకుముందు సంవత్సరం చివరికి ఇవి 3.17 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘రానున్న రోజుల్లో దేశీ వినియోగం మరింత పుంజుకుంటుంది. దీంతో బంగారం రుణాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం ఇందుకు అనుకూలిస్తుంది’’అని ఇండెల్ మనీ సీఈవో ఉమేష్ మోహనన్ తెలిపారు.