ఆర్బీఐ భారీ ఊరట.. ప్రస్తుతానికి యథాతథ స్థితి! మానిటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయాలివే!

IMPS Transaction Limit Increased And Other Key Points From RBI - Sakshi

RBI Monetary Policy Updates: డిజిటల్‌ చెల్లింపు విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీపి కబురు అందించింది. ఇమ్మిడియట్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌(IMPS) చెల్లింపుల పరిమితిని 2 లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచేసింది. ఈ మేరకు రెండురోజులపాటు సాగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, శుక్రవారం మీడియాకు వెల్లడించారు. 

యూపీఐలాగే ఐఎంపీఎస్‌ కూడా ఇన్‌స్టంట్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్వీస్‌. మొబైల్‌ ఫోన్స్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, బ్యాంక్‌ బ్రాంచ్‌లు, ఏటీఎం, ఎస్సెమ్మెస్‌, ఐవీఆర్‌ఎస్‌ సర్వీసులతో ఉపయోగించుకోవచ్చు. 2014 జనవరిలో ఐఎంపీఎస్‌ చెల్లింపు పరిమితిని 2 లక్షలుగా నిర్ణయించింది ఆర్బీఐ.  ఎస్సెమ్మెస్‌, ఐవీఆర్‌ఎస్‌ సర్వీసులతో మాత్రం ఇది 5 వేలుగానే కొనసాగుతోంది. ఈరోజుల్లో డిజిటల్‌ చెల్లింపులు ప్రామాణికంగా మారిన తరుణంలో..  ఊరటనిస్తూ ఐదు లక్షలకు ఆర్బీఐ పెంచడం విశేషం.
 
 

అక్టోబరు 6న ప్రారంభమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాల్ని శుక్రవారం ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.  వరుసగా ఎనిమిదోసారి తర్వాత కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రకటించారాయన.  రెపోరేట్‌, రివర్స్‌ రెపోరేట్‌లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి,  ఎస్‌ఎఫ్‌ కూడా 4.25 శాతానికే పరిమితం చేసినట్లు వెల్లడించారాయన. 

ఇక యూజర్లకు ఊరటనిస్తూ ఐఎంపీఎస్‌ ట్రాన్‌జాక్షన్‌ లిమిట్‌ను 2 లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచే ప్రతిపాదనను Immediate Payment Service (IMPS) యాప్స్‌ ముందు ఉంచినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో పాటు ఎన్‌బీఎఫ్‌సీల్లో పెద్ద కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత అంబుడ్స్‌మన్‌ ఏర్పాటునకు సంసిద్ధత వ్యక్తం చేసింది.  అంతేకాదు ఆఫ్‌లైన్‌పేమెంట్‌ మెకానిజంను త్వరలో తీసుకురాబోతున్నట్లు, దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ విధానంలో రిటైల్‌ డిజిటల్‌ పేమెంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది.  ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ, ఆర్బీఐ మరోసారి సర్దుబాటు వైపే మొగ్గుచూపింది. ఇక కరోనాతో ప్రభావితమైన భారత ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవడానికి  ఆర్బీఐ రెపోరేటును 2020 మేలో 4 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.

ఎంపీసీలోని కీలకాంశాలు 

చివరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నాటితో పోలిస్తే ఆర్థికంగా భారత్‌ ప్రస్తుతం మెరుగైన స్థాయిలో ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 9.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. 

ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని శక్తికాంత దాస్‌ అన్నారు.

పెట్టుబడుల్లో కూడా స్పష్టమైన పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. 

పండగ సీజన్‌లో పట్టణ ప్రాంతాల్లో గిరాకీ మరింత వేగంగా ఊపందుకుంటుందని భావిస్తోంది.

కీలక ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలోనే ఉందన్నారు.  

జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగానే ఉందని పేర్కొన్నారు.

 క్యాపిటల్‌ గూడ్స్‌కి గిరాకీ పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సర రిటైల్‌ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 5.7 శాతం నుంచి 5.3 శాతానికి సవరణ. 

జులై-సెప్టెంబరులో అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. 

అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక లక్ష్యాన్ని సైతం 5.3 శాతం నుంచి 4.5 శాతానికి కుదించారు.

రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నేపథ్యంలో వచ్చే నెల ఆహార ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండనుంది.

పేమెంట్‌ యాక్సెప్టెన్సీ కోసం పీవోఎస్‌ point of sale (PoS), క్యూఆర్‌ కోడ్‌ల తరహాలోనే జియో ట్యాగింగ్‌ టెక్నాలజీ తీసుకురావాలనే ఆలోచన  

2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటును 17.1 శాతంగా నిర్దేశించుకుంది ఆర్బీఐ.

చదవండి:  మరింత సులభతరం కానున్న లావాదేవీలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top