
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో ఆర్థిక అవకతవకలపై ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను సమీక్షించే అవకాశం ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ చరణ్‌జ్యోత్ సింగ్ నందా తెలిపారు.
ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డ్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌బీ) దీన్ని చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో రూ.2,100 కోట్ల మేర వ్యత్యాసాన్ని గుర్తించినట్లు బ్యాంక్ ఇటీవల ప్రకటించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఇండస్‌ఇండ్ వ్యవహారంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కూడా ప్రాథమిక విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.