
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌లు పెట్టుబడులకు సంబంధించి చేసే ప్రకటనలు గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతారో.. ఎవరూ ఊహించ లేరు. తాజాగా చంద్రబాబు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని అన్నారు. దాంతోపాటే ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని అని కూడా వక్కాణించారు. రానున్న నాలుగేళ్లలో ఇంకో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తామని కూడా చెప్పారు. నిజమైతే సంతోషపడవచ్చు కానీ.. రాష్ట్రంలో పరిస్థితులు అలా లేవు.
ఇండోసోల్ వ్యవహారమే పైన చెప్పుకున్నదానికి ఒక ఉదాహరణ. ఈ కంపెనీ సౌర విద్యుత్తు పరిశ్రమ కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయల వ్యయం కూడా చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం తీరు పుణ్యమా అని ఇప్పుడు ఆ కంపెనీ భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ కూడా సాహసిస్తుందా?.
ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని బృందం తయారు చేసిన టాస్క్‌ఫోర్స్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. అయితే ఇది ఆ సమావేశంలో పాల్గొన్న వారికి కూడా ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. చంద్రశేఖరన్ వంటి బిజీ పారిశ్రామికవేత్త ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక తయారు చేసేంత తీరిక ఉంటుందా? అన్నది ప్రశ్న. నివేదికకు కాస్త మర్యాద దక్కుతుందని ఆయన పేరు జోడించారేమో తెలియదు! అయినా ఫర్వాలేదు కానీ ఆ నివేదికను పరిశీలించినా, చంద్రబాబు మాటలు చూసినా నేల విడిచి సాము చేసే తీరులోనే ఉన్నట్టు అనిపించక మానదు.
2014-19 మధ్యకాలంలోనూ చంద్రబాబు ఇలాంటి సమావేశాలు బోలెడు పెట్టారు. అదిగో పెట్టుబుడులు.. ఇదిగో అభివృద్ధి అని డాబుసరి కబుర్లు చెప్పేవారు. 2029 నాటికి ఏపీ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అవుతుందని, ఆ తర్వాత ప్రపంచంలోనే టాప్-5లో ఉంటుందని ఏవేవో చెప్పేవారు. అంతేకాదు.ఆయా జిల్లాలలో ఏఏ రంగాలను అభివృద్ది చేస్తారో, ఏ ప్రాజెక్టులు వస్తాయో చెబుతూ అసెంబ్లీలో పెద్ద స్పీచ్ ఇచ్చారు కూడా. అప్పట్లో వైసీపీలో ఉండి.. ఇప్పుడు టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు ప్రకటనలు రియల్ ఎస్టేట్ బ్రోచర్‌తో పోల్చారు కూడా. చివరకు అయ్యింది కూడా అదే. చంద్రబాబు హామీలేవీ అమలు కాలేదు.
2024లో అధికారం దక్కిన తరువాత మరోమారు చంద్రబాబు తన పాత స్టైల్‌ను భుజాలకు ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది తాజా ప్రకటన చూస్తే. గత ఏడాది దావోస్ పర్యటనకు ముందు కూడా నానా ఆర్భాటమూ జరిగింది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తాయని టీడీపీ మీడియా ఊదరగొట్టింది. తీరా చూస్తే వచ్చింది హళ్లికి హళ్లి! దీని కవరింగ్ కోసం ‘‘ఏపీ గుడ్‌విల్ పెంచేందుకు వెళ్లాము తప్ప పెట్టుబడుల కోసం కాదు’’ అన్న బుకాయింపులు! దావోస్ పర్యటన వైఫల్యంతో చంద్రబాబు తన రూటు మార్చారు. కొంతకాలం తరువాత రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి అని ప్రకటించారు. ఆ తరువాత ఈ అంకెలు ఐదు లక్షల కోట్లకు, మరికొన్ని నెలలకు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకున్నాయి. మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని శాసనమండలిలోనూ ప్రకటించారు. లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్న చందంగా జవాబు ఇవ్వడం వివాదాస్పదమైంది కూడా. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పాట రూ.పది లక్షల కోట్లకు చేరుకుంది!.
పారిశ్రామిక దిగ్గజాలుగా పేరొందిన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకే మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం కష్టంగా ఉంటే, ఆ స్థాయిలో పారిశ్రామికీకరణ జరగని ఏపీకి ఏడాదిలోనే రూ.పది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చెబితే వెరైనా నమ్ముతారా? సీఐఐ సదస్సుల్లో
పాల్గొనే పారిశ్రామికవేత్తలకు ఈ విషయాలు తెలియవా? కనీసం వచ్చిన పెట్టుబడులు ఏ ఏ రంగాలకు చెందినవి, ఏ కంపెనీలు పెడుతున్నాయని చెప్పి ఉంటే కొంతైనా నమ్మకం కలిగేదేమో! అదేమీ చేయరు. తోచిన గణాంకాలు చెప్పడం తప్ప వాటికి ఆధారాలు చూపే అలవాటు లేదు. గతంలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ నోటికి వచ్చిన అంకెను చెబుతుండే వారు. చివరకు ఈ అప్పుల అంకె రూ.14 లక్షల కోట్లకు చేరుకుంది కూడా. కానీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా అప్పులు రూ.ఆరు లక్షల కోట్లేనని ఒప్పుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు వ్యవహార శైలి ఇలా ఉంటుంది!.
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్శించాలన్న చిత్తశుద్ధి ఉంటే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రామాయపట్నం వద్ద ఇండోసోల్ రూ.40 వేల కోట్లతో ప్రతిపాదించిన సౌరశక్తి పరిశ్రమకు కొత్త చిక్కులు తెచ్చే వారా! ఆ కంపెనీ ఇప్పటికే రూ.1200 కోట్ల వరకూ వ్యయం చేసింది. పంటలు పెద్దగా పండని భూములు ఐదువేల ఎకరాలను ఈ కంపెనీ రూ.500 కోట్లతో సేకరిస్తే... ప్రభుత్వం ఇప్పుడు వాటిని వెనక్కు తీసుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకూ సబబు? భూములివ్వమని భీష్మించుకున్న కరెడు ప్రాంతంలో భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ కంపెనీ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేయడమే అవుతుంది. పైగా ఇండోసోల్ సేకరించిన భూమిని వస్తుందో, రాదో తెలియని బీపీసీఎల్‌కు ఇస్తారట. దీనికి వేరేచోట భూమి కేటాయిస్తే నష్టమేమిటి? ఈ విషయాలు.. దాని వెనుక మతలబులు పారిశ్రామిక వర్గాలకు తెలియకుండా ఉంటాయా?..
రానున్న పాతికేళ్లలో 2.4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని కూడా చంద్రబాబు ఆ సమావేశంలో ప్రకటించారు. ఇది కూడా గతంలో చంద్రబాబు చెప్పిన ‘విజన్-2020’ బాపతు వ్యవహారమే. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ తరచి చూస్తే బాబుగారి డొల్లతనం ఏమిటో బయటపడుతుంది. పాతికేళ్ల క్రితం కుటుంబానికో ఐటి ఫ్రొఫెషనల్ నినాదంతో పని చేశామని చంద్రబాబు చెప్పడం ఇంకో విడ్డూరం. బెంగళూరు, చెన్నై, పూణె వంటి నగరాలు ఐటీకి పెట్టింది పేరుగా ఉన్న ఆ సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ రంగం పురోగమించాలన్న లక్ష్యంతో హైటెక్ సిటీకి శంకుస్థాపన కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత సీఎం పీఠమెక్కిన చంద్రబాబు భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంతే. కానీ.. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని తానే మొదలుపెట్టానని, హైటెక్ సిటీ మొత్తం తన సృష్టి అని మాట్లాడటం అతిశయోక్తి తప్ప ఇంకోటి కాదు.
2004- 2009 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్‌రోడ్డు వంటి అద్భుత మౌలిక సదుపాయాలను కల్పించారు. దీంతో నగరం రూపురేఖలు మరింత మారిపోయాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దానిని సరిగా ప్రచారం చేసుకోలేకపోయింది.
2004లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబుకు హైదరాబాద్‌తో అధికారికంగా సంబంధం లేనట్లే. కానీ.. రెండు దశాబ్దాల తర్వాత కూడా హైదరాబాద్ తనే అభివృద్ది చేశానని చెప్పుకుంటూటారు ఆయన! విభజన తరువాత 2014లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఐటీలో హైదరాబాద్‌ను తానే వృద్ధి చేశానని చెప్పిన మాటలే నిజమైతే 2014- 19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆ స్థాయిలో ఎందుకు ఐటీ పరిశ్రమలను తేలేకపోయారన్నది ప్రశ్న. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలను ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు? స్వోత్కర్ష చంద్రబాబుకు బాగా వచ్చు. మిగిలిన వారు సెల్ఫ్ డబ్బా అని విమర్శించినా పట్టించుకోరు. ఇతర రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో ఎవరో ఒకరిని తీసుకు వస్తారు. మర్యాద కోసం వారు ఆయనను ఉద్దేశించి ఒక మాట పొగిడితే, దానిని తెలుగుదేశం మీడియాతో హోరెత్తేలా ప్రచారం చేయించుకోగలరు. ఇప్పుడు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పడం కూడా అలాంటి వ్యూహంలో ఒక భాగమే!.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.