పల్నాడులో మాజీ మంత్రి విడదల రజినిపై దాడికి యత్నించిన టీడీపీ గూండాలు.. ఇవాళ గుంటూరులో రెచ్చిపోయారు. తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరారు.
అయితే.. గుంటూరు సెంటర్‌లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు. అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు . అయితే దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్ హల్‌చల్ చేసింది. పోలీసులు అక్కడ ఉండగానే వాటిని పట్టుకుని అక్కడంతా కలియ దిరిగింది. పట్టపగలే ఇలా సంచరిస్తుండడంతో.. ప్రజలంతా భీతిల్లిపోయారు. పోలీసులైనా వాళ్లను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నారు.



మరోవైపు ప్లాన్ ప్రకారమే తనపై దాడికి యత్నించారన్న అంబటి రాంబాబు.. ఇటు పోలీసుల తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారు. కూటమి వేసిన ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాయడం చూస్తుంటే.. అసలు పోలీస్ వ్యవస్థ బతికే ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన.
::సాక్షి ప్రతినిధి, గుంటూరు


