రికార్డు స్థాయిలో సేల్స్‌.. ఎగబడుతున్న జనం, ఆ ఇళ్లకి యమడిమాండ్‌!

Hyderabad Real Estate: House Sales Demand Rises Says Survey - Sakshi

68 శాతం మంది బడ్జెట్‌ ఆధారంగా నిర్ణయం 

రూ. 60 లక్షల లోపు ధర ఇళ్లకు డిమాండ్‌  

వ్యక్తిగత గృహాలకే ఎక్కువ ఆసక్తి 

59 శాతం మంది తొలి గృహ కొనుగోలుదారులే 

నో బ్రోకర్‌.కామ్‌ వార్షిక నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనాతో సొంతింటి అవసరం పెరిగింది. దీంతో గతేడాది గృహ విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. అందుబాటు వడ్డీ రేట్ల, ప్రభుత్వ రాయితీలు, డెవలపర్ల ఆఫర్లు వంటివి ఈ రంగంలో డిమాండ్‌ను మరింత పెంచాయి. దీంతో గృహ కొనుగోలుదారులలో సానుకూల దృక్పథం నెలకొందని నో బ్రోకర్‌.కామ్‌ వార్షిక నివేదిక వెల్లడించింది. లగ్జరీ గృహాలకు డిమాండ్, అద్దెలు పెరగడం, ప్రవాసుల ఆసక్తి, స్థలాలకు గిరాకీ పెరగడం ఇవే ఈ ఏడాది స్థిరాస్తి రంగానికి చోదకశక్తిలా మారతాయని అంచనా వేసింది. గతేడాది హైదరాబాద్‌ స్థిరాస్తి రంగంలోని పలు ఆసక్తికర అంశాలివే..

► ఈ ఏడాది సొంతిల్లు కొనుగోలు చేయాలని 82% మంది ఆసక్తిగా ఉన్నారు. 31% మంది అద్దెలు పెరిగిపోతుండటంతో సొంతిల్లు కొనాలని భావిస్తుండగా.. 34% సెక్యూరిటీ, 21% అందుబాటు ధరలు, 6% డబ్బు ఆదా, 8% పెళ్లి కోసం ఇల్లు కొనాలనుకుంటున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు 75% మంది ఆసక్తి చూపిస్తుండగా.. నిర్మాణంలో ఉన్న వాటిల్లో 8%, ప్లాట్‌ కొనేందుకు 17%  మంది సిద్ధంగా ఉన్నారు. 

► 50% మంది వ్యక్తిగత గృహాలు కొనాలని భావిస్తుండగా 38% మంది గేటెడ్‌ కమ్యూనిటీలో, 12 శాతం మంది ప్లాట్‌ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి కొనుగోలు సమయంలో నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడట్లేదు. 64 శాతం మంది క్వాలిటీ గురించి వాకబు చేస్తుండగా.. 39 శాతం అనుమతులు, 25 శాతం డెవలపర్‌ పాత చరిత్ర, 25 శాతం బిల్డర్‌ నమ్మకం మీద ఆధారపడి కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. 78 శాతం మంది వాస్తు ఉన్న ఇళ్లకు మొగ్గుచూపించగా.. 22 శాతం మంది అవేవీ పట్టించుకోవట్లేదు. 

► సొంతింటి కొనుగోలులో పెద్దలదే పైచేయి. 37 శాతం మంది 50 ఏళ్ల పైబడిన కొనుగోలుదారులే ఉండగా.. 36 శాతం 25–40 ఏళ్ల వయస్కులు, 25 శాతం 40–50 ఏళ్లు, 2 శాతం 18–15 ఏళ్ల వాళ్లున్నారు. 65 శాతం మంది పురుషులే కాగా.. 35 శాతం మహిళా యజమానులున్నారు. ఉద్యోగాల వారీగా చూస్తే.. 53 శాతం ప్రైవేట్‌ ఉద్యోగస్తులే గృహ కొనుగోలుదారులు కాగా.. 28 శాతం మంది వ్యాపారస్తులు, 19 శాతం ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 

► నగరంలో 59 శాతం మంది తొలిసారి గృహ కొనుగోలుదారులే. 84 శాతం మంది సొంతంగా ఉండేందుకు ఇళ్లను కొనుగోలు చేస్తుంటే.. 16 శాతం పెట్టుబడిరీత్యా కొంటున్నారు. ఇందులోనూ 79 శాతం మంది నివాస సముదాయాలలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఆసక్తి కనబర్చగా, 21 శాతం వాణిజ్య పెట్టుబడులకు జై కొట్టారు.

ఎంపికలో ‘కీ’లకమైనవివే.. 
నగరవాసుల సొంతింటి ఎంపికలో అత్యంత కీలకమైనది ధర ఎంతనేదే. 68% బడ్జెట్‌ ఆధారంగా కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. అత్యధికంగా 46% మంది రూ.60 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు ఆసక్తిగా ఉండగా.. 25% మంది రూ.60–80 లక్షలు, 18% రూ.80 లక్షలపైన, 11 శాతం రూ.కోటి పైన ధర ఉన్న ఇళ్లు కొనాలని భావిస్తున్నారు. బడ్జెట్‌ కాకుండా 30% నీటి సరఫరా, 32% ఆఫీసు నుంచి దూరం, 22% ప్రజా రవాణా సదుపాయాలు, 19% ఇంటి విస్తీర్ణం, 24% వసతులు, 22% మంది ధరలో వృద్ధి ఆధారంగా ఇంటిని కొనుగోలు చేస్తున్నారు.

చదవండి: జియో బంపర్‌ ఆఫర్‌.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top