హైదరాబాద్‌లో ఆఫీస్‌ వసతులు రూ.1.39 లక్షల కోట్లు  | Hyderabad office market saw strong performance says Knight Frank | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఆఫీస్‌ వసతులు రూ.1.39 లక్షల కోట్లు 

Aug 5 2025 6:10 AM | Updated on Aug 5 2025 7:53 AM

Hyderabad office market saw strong performance says Knight Frank

123 మిలియన్‌ చదరపు అడుగులు

టాప్‌–8 నగరాల్లో రూ.16.27 లక్షల కోట్లు 

నైట్‌ఫ్రాంక్‌ నివేదిక వెల్లడి 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో రూ.1.39 లక్షల కోట్ల విలువైన 123 మిలియన్‌ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) కార్యాలయ వసతులు (ఆఫీస్‌ స్పేస్‌) ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్‌ నివేదిక వెల్లడించింది. అంతేకాదు దేశవ్యాప్తంగా టాప్‌–8 నగరాల్లో జూన్‌ త్రైమాసికం చివరికి 993 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులో ఉండగా, దీని విలువ 187 బిలియన్‌ డాలర్లు ఉన్నట్టు తెలిపింది. 

ఈ నగరాల్లో సెపె్టంబర్‌ త్రైమాసికం చివరికి కార్యాలయ వసతుల పరిమాణం బిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం యూఎస్‌లో 10.2 బిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ, చైనాలో 6.26 బిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ, జపాన్‌లో 1.77 బిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ చొప్పున ఆఫీస్‌ స్పేస్‌ ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘2005లో 200 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్న ఆఫీస్‌ స్పేస్‌ ఏటా 8.6 శాతం చొప్పున పెరుగుతూ వచి్చంది. ఈ ఏడాది చివరికి బిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకుంటుంది’’అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది.  

నగరాల వారీగా..  
→ బెంగళూరులో ఆఫీస్‌ వసతుల పరిమాణం జూన్‌ చివరికి 229 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉండగా, దీని వలువ 49 మిలియన్‌ డాలర్లు. 
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 44 బిలియన్‌ డాలర్ల విలువైన 199 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ కార్యాలయ వసతులు అందుబాటులో ఉన్నాయి. 
→ ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో మొత్తం 169 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ (41 బిలియన్‌ డాలర్లు) అందుబాటులో ఉంది.  
→ పుణెలో 106 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ ఉండగా, దీని విలువ 16 బిలియన్‌ డాలర్లు. 
→ 13 బిలియన్‌ డాలర్ల విలువైన 92 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ ఆఫీసు వసతులకు చెన్నై నగరం వేదికగా ఉంది.  
→ అహ్మదాబాద్‌లో 41 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ (4 బిలియన్‌ డాలర్లు), కోల్‌కతాలో 34 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ (4 బిలియన్‌ డాలర్లు) మేర కార్యాలయ వసతులు ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.  
→ టాప్‌–8 నగరాల్లోని మొత్తం ఆఫీస్‌ స్పేస్‌లో గ్రేడ్‌–ఏ వసతులు 53 శాతంగా ఉంటే, గ్రేడ్‌–బీ వాటా 43 శాతంగా, గ్రేడ్‌–సీ 4 శాతం చొప్పున ఉన్నాయి.

జీసీసీలు ప్రధాన చోదకం 
‘‘గత 35 ఏళ్లలో భారత్‌లో ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ ఎంతో మార్పును చూసింది. ముఖ్యంగా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌కు ప్రధాన చోదకంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆఫీస్‌ మార్కెట్‌గా భారత్‌ అవతరించింది. ఇప్పటికే 0.99 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులో ఉండగా, బిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ మార్క్‌ను త్వరలో చేరుకోనుంది’’అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా రీసెర్చ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గులామ్‌ జియా తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement