ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం.. కాంపౌండింగ్‌

How to invest in king of  income compounding investment - Sakshi

రాబడులపై రాబడి  దీర్ఘకాలంలో అధిక ప్రతిఫలం 

పెట్టుబడుల్లో రిస్క్‌ కూడా తక్కువ 

 పోర్ట్‌ఫోలియోలో డెట్‌కూ చోటు

పెట్టుబడులపై రాబడి ఎంతన్నది ఇన్వెస్టర్లు ముందుగా చూసే అంశం. రాబడితోపాటు.. కాంపౌండింగ్‌ను కూడా చూసే స్మార్ట్‌ ఇన్వెస్టర్లు కూడా ఉంటారు. పెట్టుబడులపై రాబడిని ప్రతిఫలంగా పరిగణిస్తే.. కాంపౌండింగ్‌ (రాబడులపై రాబడి) అన్నది బోనస్‌ అవుతుంది. అందుకే కాంపౌండింగ్‌ను ప్రపంచంలో ఎనిమిదో అద్భుతంగా చెబుతుంటారు. ఈక్విటీ పెట్టుబడులపై కాంపౌండింగ్‌ ప్రయోజనం ఏ మేరకు అనేది దీర్ఘకాలంలోనే తెలుస్తుంది. అది కూడా విజయవంతమైన పెట్టుబడుల విషయంలోనే కాంపౌండింగ్‌ ప్రయోజనాన్ని రుచి చూడగలరు. కానీ, డెట్‌ పెట్టుబడులపై అలా కాదు.. కాంపౌండింగ్‌ ప్రయోజనాన్ని ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్లు పరిశీలించుకోవచ్చు. స్పష్టంగా చెప్పుకోవాలంటే.. డెట్‌ పెట్టుబడుల్లో కాంపౌండింగ్‌ స్థిరంగా ఉంటుంది. ఈక్విటీల్లో అస్థిరంగా ఉంటుంది. డెట్‌ సాధనాల్లో పెట్టుబడులపై దీర్ఘకాలంలో (మీ లక్ష్యానికి అవసరమైన వ్యవధిపై) ఎంత మేర సమకూరుతుందన్నది ముందుగానే ఓ స్పష్టమైన అంచనాకు రావచ్చు. కానీ, ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఈ విధమైన ముందస్తు అంచనాలు సఫలం కావాలని లేదు. కేవలం అంచనాలకే పరిమితం కావాలి. కనుక ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొంత డెట్‌ పెట్టుబడులకు చోటివ్వడం ద్వారా స్థిరమైన.. రిస్క్‌ లేని రాబడులను, రాబడులపై రాబడులతో కూడిన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.

ఈక్విటీలు లేదా ఫండ్స్‌లో అయితే...
ఒకవేళ మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా ఇండెక్స్‌ ఫండ్స్‌ రూపంలో ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టినట్టయితే అప్పుడు కాంపౌండింగ్‌ చాలా తక్కువగా ఉంటుంది. కాంపౌండింగ్‌ రేటు ఎక్కువా లేక తక్కువా అన్నది పెట్టుబడులు పెట్టిన సమయం ఎటువంటిది..? ఎంత కాలం పాటు అందులో పెట్టుబడులను కొనసాగించారన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది. గడిచిన 20 ఏళ్ల కాలంలో నిఫ్టీ 50 టీఆర్‌ఐ (టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌) రోలింగ్‌ రిటర్నులను (నిర్ణీత కాలంలో వార్షిక సగటు రాబడులు) విశ్లేషించినట్టయితే.. ఐదేళ్ల కాలంలో కాంపౌండెడ్‌గా వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 13 శాతం సందర్భాల్లో 7 శాతాన్ని మించి లేదు. కనీసం పదేళ్ల పెట్టుబడుల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా.. అధిక సీఏజీఆర్‌కు హామీలేని పరిస్థితి. 2007 చివర్లో నిఫ్టీ–50 ఇండెక్స్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసి 2017 వరకు కొనసాగించి ఉంటే వచ్చిన రాబడి.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సీఏజీఆర్‌ 7 శాతం కంటే తక్కువగానే ఉంది. కానీ, డెట్‌ పెట్టుబడులు అలా కాదు. కాంపౌండింగ్‌ విషయంలో ఎంతో స్పష్టత ఉంటుంది. అందుకే చిన్నారుల ఉన్నత విద్య, పిల్లల వివాహాలు, రిటైర్మెంట్‌ వంటి దీర్ఘకాల లక్ష్యాలకు పెట్టుబడుల ప్రణాళిక వేసుకునే వారు.. డెట్‌ సాధనాలకూ చోటివ్వడం అర్థవంతంగా ఉంటుంది.

డెట్‌ : డెట్‌ పెట్టుబడుల్లో కాంపౌండింగ్‌ స్థిరంగా ఉంటుంది. ఈక్విటీ పెట్టుబడులను తీసుకున్నట్టయితే.. ఒక ఏడాది పెట్టుబడులపై రాబడి రేటు 30 శాతంగా ఉండొచ్చు. మరుసటి ఏడాది 15 శాతం నష్టాన్ని ఇవ్వొచ్చు. తర్వాతి సంవత్సరంలో తిరిగి 20 శాతం ప్రతిఫలం రావచ్చు. ఈ విధమైన క్రమబద్ధం లేని రాబడుల వల్ల పెట్టుబడులపై స్థిరమైన కాంపౌండింగ్‌కు అవకాశం ఉండదు. ఈక్విటీల్లోనూ అద్భుతమైన కాంపౌండింగ్‌ ప్రయోజనాన్ని అందుకోవచ్చనే ఇన్వెస్టర్లు తప్పకుండా మన చుట్టూ ఉంటారు. నిజమే.. అది ఎప్పుడంటే.. గొప్ప వ్యాపార నమూనాలు, పోటీ సంస్థలు వచ్చినా చెక్కుచెదరని పటిష్టత (ఉదాహరణకు పిడిలైట్, ఏషియన్‌ పెయింట్స్‌) తదితర బలాలు, నైపుణ్యాలు కలసిన సంస్థలు కొన్నే ఉంటాయి. అటువంటి కంపెనీలలో దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు, మంచి కాంపౌండింగ్‌ను ఆశించొచ్చు. వ్యాపారంలో వచ్చిన లాభాలను తిరిగి వ్యాపారంపై ఇన్వెస్ట్‌ చేస్తూ రాబడులను పెంచుకోవడం ద్వారా అధిక కాంపౌండింగ్‌ను ఇచ్చే కంపెనీలు ఇలాంటి కొన్నే ఉంటాయి. అటువంటి కంపెనీలను గుర్తించి వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ప్రయోజనాలు పొందాలనుకుంటే.. అందుకు గొప్ప నైపుణ్యాలకుతోడు అదృష్టం తోడవ్వాలి. 

ఎంపికలు: డెట్‌ సాధనాల్లోనూ అన్నింటిలో కాంపౌండింగ్‌ స్థిరత్వం ఉంటుందని భావించడం సరికాదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేసినా.. లేక నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినా కాంపౌండింగ్‌ను ముందే అంచనా వేయవచ్చు. వీటిల్లో పెట్టుబడులు పెట్టే సమయంలో క్యుములేటివ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనికి బదులు ఇన్‌కమ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే పెట్టుబడిపై వడ్డీ రాబడి ఎప్పటికప్పుడు క్రమంగా మీ చేతికి అందుతుంది. దీనివల్ల కాంపౌండింగ్‌ ప్రయోజనం నెరవేరదు. పెట్టుబడి కాలవ్యవధి తీరేంత వరకూ ఈ విధానంలో స్థిరమైన ఆదాయం వస్తుంది అంతే. అందుకే డెట్‌ సాధనాల్లో కాస్తంత రాబడి తక్కువగా ఉన్నప్పటికీ.. కాంపౌండింగ్‌ ఆప్షన్‌ ఉన్న సాధనాలను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఏడేళ్ల గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా ఫ్లోటింగ్‌ రేటు సేవింగ్స్‌ బాండ్‌ 7.15 శాతం రేటును ఆఫర్‌ చేస్తోంది. ఆకర్షణీయమైన డెట్‌ ఆప్షన్లలో ఇది కూడా ఒకటి. కాకపోతే ఇందులో ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్‌కు వడ్డీ ఆదాయాన్ని చెల్లించే ఆప్షన్‌ మాత్రమే ఉంది. మెరుగైన, ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కనుక ఇందులో ఇన్వెస్ట్‌ చేయాలని భావించే వారు.. ఎప్పటికప్పుడు క్రమంగా చేతికి అందే వడ్డీ ఆదాయాన్ని తిరిగి రికరింగ్‌ డిపాజిట్‌ సాధనంలోకి మళ్లించడం ద్వారా మరింత మెరుగైన కాంపౌండింగ్‌ రాబడిని అందుకోవచ్చు. ఇందుకు బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్‌ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది.

దీర్ఘకాల లక్ష్యాల కోసం డెట్‌ సాధనాలను పరిగణించే వారికి పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) మెరుగైన ఎంపిక అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో రాబడిపై పన్ను ఉండదు. పదిహేనేళ్ల సాధనం. రాబడి అసలుకు ఏటా కలుస్తూ ఆ మొత్తంపై మరుసటి ఏడాది రాబడి జమ అవుతుంది. దీంతో పదిహేనేళ్ల కాలంలో మెరుగైన నిధిని సమకూర్చుకోవచ్చు. కావాలంటే 15 ఏళ్ల తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకునే ఆప్షన్‌ కూడా ఉంటుంది. కాంపౌండింగ్‌ కోసం చూసే వారు డెట్‌లో సార్వభౌమ హామీతో కూడిన సాధనాలు లేదా ఏఏఏ రేటింగ్‌ ఉన్న సాధనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకానీ, అధిక రాబడుల కోసం తక్కువ క్రెడిట్‌ రేటింగ్‌ సాధనాల జోలికి వెళితే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంటుంది. ఎన్‌సీడీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తదితర సాధనాల్లో క్యుములేటివ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటున్నారంటే.. మీ పెట్టుబడిని నిర్దేశిత కాలం వరకు సంబంధిత సంస్థ వద్దే అట్టి పెట్టుకునేందుకు అనుమతిస్తున్నట్టు గుర్తుంచుకోవాలి. కనుక రాబడి కోసం నాణ్యత లేని డెట్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మీ అసలు పెట్టుబడిని ప్రమాదంలో పడేసుకోవద్దు. ఇక రాబడులపై ఎంత పన్ను అన్నది మీ ఆదాయంపైనే ఆధారపడి ఉంటుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఎన్‌సీడీల్లో క్యుములేటివ్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నప్పటికీ.. వచ్చే ఆదాయం ఏటేటా మీ వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. దాన్ని ఆదాయపన్ను రిటర్నుల్లో చూపించి మీకు వర్తించే రేటు ప్రకారం పన్ను చెల్లించాలి.

ఏ సాధనంలో ఏ మేరకు..: 
కాంపౌండింగ్‌ వడ్డీ కోసం చూస్తున్నవారికి పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలు కూడా ఆకర్షణీయమైనవే. భద్రతకుతోడు, మెరుగైన రాబడులను ఇవి ఆఫర్‌ చేస్తున్నాయి. ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్, నెలవారీ ఆదాయ పథకం, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌) పథకాలు ఎప్పటికప్పుడు వడ్డీని చెల్లించే ఆప్షన్లతో కూడినవి. వీటిల్లో క్యుములేటివ్‌కు అవకాశం లేదు. పెద్ద బ్యాంకులు, మంచి రేటింగ్‌ కలిగిన ఎన్‌బీఎఫ్‌సీల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు క్యుములేటివ్‌ ఆప్షన్లు ఉన్నప్పటికీ.. పన్ను కోణం నుంచి చూస్తే అవి అంత మెరుగైన ఆప్షన్లు కావు. 3-5 ఏళ్ల కోసం అక్రూయల్‌ డెట్‌ ఫండ్స్‌ (కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్, పీఎస్‌యూ అండ్‌ బ్యాంకింగ్‌ ఫండ్స్, షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌), ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్లు మంచి ఎంపికలు అవుతాయి. 5-7 ఏళ్ల కోసం పోస్టాఫీసు నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ను పరిశీలించొచ్చు.

పదేళ్లకు పైన కాలానికి అయితే పీపీఎఫ్‌ మంచి కాంపౌండింగ్‌ ఆప్షన్‌ అవుతుంది. రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకోవాలనుకునే వారికీ పీపీఎఫ్‌ మంచి సాధనమే. రిటైర్మెంట్‌ కోసమే అయితే ఎన్‌పీఎస్‌లో డెట్‌ విభాగం ఎంపిక చేసుకుంటే దీర్ఘకాలంలో అధిక కాంపౌండింగ్‌ రేటును సొంతం చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో డెట్‌ విభాగంలో కార్పొరేట్, ప్రభుత్వ బాండ్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. క్యుములేటివ్‌ ఆప్షన్‌ లేని డెట్‌ సాధనాలను ఎంపిక చేసుకుంటే మాత్రం.. ఎప్పటికప్పుడు వచ్చే రాబడిని తిరిగి పెట్టుబడులకు మళ్లించడం కచ్చితంగా చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. ఎంపిక చేసుకునే సాధనం ఏదైనా కానీయండి.. మీ లక్ష్యాలకు, రిస్క్‌ సామర్థ్యానికి అనుకూలంగా ఉందా అన్న స్పష్టత ఎంతో ముఖ్యమని మర్చిపోవద్దు. అదే విధంగా డెట్‌కు ఎంత మేరకు కేటాయించుకోవచ్చు.. తదితర అంశాల్లో స్పష్టత లేకపోతే పెట్టుబడుల సలహాదారులు, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్ల సాయాన్ని తీసుకోవడం మరవద్దు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top