
క్యూ1లో 8–10 శాతం అప్
క్వెస్ కార్ప్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాల పరిస్థితి మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 3–6 శాతం క్షీణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మాత్రం 8–10 శాతం హైరింగ్ పెరిగింది. ఏఐ, ప్లాట్‌ఫాం ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీలాంటి విభాగాల్లో నిపుణులకు డిమాండ్ నెలకొంది. స్టాఫింగ్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
అన్ని విభాగాల్లోను పెద్ద సంఖ్యలో రిక్రూట్‌మెంట్ చేపట్టకుండా, దీర్ఘకాలికంగా మరింత విలువను చేకూర్చే, కొత్త ఆవిష్కరణలకు తోడ్పడే నైపుణ్యాలున్న వారినే నియమించుకోవడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నట్లు నివేదిక పేర్కొంది. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), తయారీ, ఆటోమోటివ్ .. ఎనర్జీ, టెక్నాలజీ..హార్డ్‌వేర్ లాంటి విభాగాల్లో నియామకాలకు డిమాండ్ నెలకొన్నట్లు వివరించింది.
స్మార్ట్ ఫ్యాక్టరీలు, పారిశ్రామిక ఐవోటీ, ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్‌ఫాంలోకి పెట్టుబడుల ప్రవాహం కారణంగా తయారీ, ఆటోమోటివ్, ఎనర్జీ విభాగాల్లో అత్యధికంగా హైరింగ్ డిమాండ్ త్రైమాసికాలవారీగా 31 శాతం మేర పెరిగింది. మొత్తం జీసీసీ మార్కెట్లో 20 శాతం వాటాతో బీఎఫ్‌ఎస్‌ఐ గణనీయంగా నియామకాలు చేపట్టింది. ఏఐ ఆధారిత క్రెడిట్ రిస్క్ అనాలిసిస్, సైబర్‌సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ నెలకొనడంతో ఈ విభాగంలో హైరింగ్ త్రైమాసికాలవారీగా 15 శాతం పెరిగింది. మరోవైపు హాస్పిటాలిటీ, ట్రావెల్..లాజిస్టిక్స్ విభాగంలో హైరింగ్ 25 శాతం, నిర్మాణ..ఇంజినీరింగ్ విభాగంలో 15 శాతం తగ్గింది.
నివేదికలో మరిన్ని వివరాలు..
→ భౌగోళికంగా చూస్తే ప్రథమ శ్రేణి నగరాల్లో హైరింగ్ గణనీయంగా ఉంది. 29 శాతం మార్కెట్ వాటాతో బెంగళూరు.. జీసీసీ హబ్‌గా కొనసాగుతున్నప్పటికీ, ప్రదాన మెట్రోలతో పోలిస్తే నియామకాల వృద్ధి అత్యంత తక్కువగా 3.20 శాతంగా నమోదైంది. ప్రథమ శ్రేణి నగరాల్లో పుణె (10.60 శాతం), చెన్నై (9.40 శాతం) అత్యధిక వృద్ధి నమోదు చేశాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా రిక్రూట్‌మెంట్‌పరంగా అధిక వృద్ధి నమోదైంది. కోయంబత్తూర్‌లో 34.10 శాతం, కోచిలో 27.60 శాతం, అహ్మదాబాద్‌లో 24.60 శాతం మేర వృద్ధి నమోదైంది.
→ ఏఐ, డేటా సైన్స్, ప్లాట్‌పాం ఇంజినీరింగ్ లాంటి విభాగాల్లో హోదాను బట్టి నిపుణుల కొరత 25 శాతం నుంచి 40 శాతం వరకు ఉంటోంది. దీనితో హైరింగ్ ప్రక్రియ నెమ్మదిస్తోంది. అత్యుత్తమ నైపుణ్యాలున్న వారికి మెట్రోల్లో రూ. 50–60 లక్షల స్థాయిలో ప్యాకేజీలు ఉంటున్నాయి.