
న్యూఢిల్లీ: వచ్చే నెల ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీఎక్స్2 కోసం సబ్‌స్క్రిప్షన్ ఆధారిత బ్యాటరీ–యాజ్–ఏ–సర్వీస్ (బీఏఏఎస్) ఆప్షన్‌ను అందించనున్నట్లు టూ–వీలర్ల దిగ్గజం హీరో మోటోకార్ప్ తెలిపింది. దీనితో వాహనానికి ముందుగా చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా తగ్గుతుందని, మరింత మందికి ఎలక్ట్రిక్ మొబిలిటీ చేరువయ్యేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది.
కస్టమర్లు తమ రోజువారీ, నెలవారీ బడ్జెట్, వినియోగాన్ని బట్టి సరళతరమైన సబ్‌్రస్కిప్షన్ ప్లాన్లను ఎంచుకోవచ్చని వివరించింది. స్కూటర్ చాసిస్, బ్యాటరీకి వేర్వేరుగా ఫైనాన్స్ తీసుకునే ఆప్షన్ ఉండటం వల్ల ముందస్తుగా పెద్ద మొత్తం చెల్లించాల్సిన భారం తగ్గుతుందని కంపెనీ తెలిపింది. బీఏఏఎస్ మోడల్, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు, ధర మొదలైన పూర్తి వివరాలను జూలై 1న కంపెనీ ప్రకటించనుంది.