హెరిటేజ్‌ ‘ఫ్యూచర్‌’ వాటాల విక్రయం! 

Heritage Fooda Company Shares In Future Retail Will Sell - Sakshi

సాక్షి, హైదరాబాద్ : డెయిరీ రంగంలో ఉన్న హెరిటేజ్‌ ఫుడ్స్‌.. ఫ్యూచర్‌ రిటైల్‌లో కంపెనీకి ఉన్న 1,78,47,420 షేర్లతోపాటు ప్రాక్సిస్‌ హోమర్‌ రిటైల్‌కు చెందిన 8,92,371 షేర్లను విక్రయించనుంది. ఒకేసారి/పలు దఫాలుగా బహిరంగ మార్కెట్, మర్చంట్‌ బ్యాంకర్‌ను నియమించడం ద్వారా, ఒకరు లేదా ఎక్కువ మంది కొనుగోలుదార్లకు ఈ వాటాలను అమ్మాలని శుక్రవారం సమావేశమైన బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కంపెనీ వైస్‌ చైర్‌పర్సన్, ఎండీ ఎన్‌.భువనేశ్వరికి బోర్డు అధికారాన్ని కట్టబెట్టింది. ఇదిలావుంటే శుక్రవారం హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.95 శాతం తగ్గి రూ.338.25 వద్ద స్థిరపడింది. (హెరిటేజ్ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారా?..)

ఇదీ నేపథ్యం.. 
హెరిటేజ్‌ ఫుడ్స్‌కు చెందిన రిటైల్, అనుబంధ వ్యాపారాలను 2016 నవంబర్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌లో భాగంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో 3.65 శాతం వాటాకు సమానమైన రూ.295 కోట్ల విలువైన 1.78 కోట్ల ఫ్రెష్‌ ఈక్విటీ షేర్లను హెరిటేజ్‌ ఫుడ్స్‌ దక్కించుకుంది. ఈ వాటాలనే ఇప్పుడు హెరిటేజ్‌ విక్రయిస్తోంది. కాగా, వ్యాపార దిగ్గజం ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ కంపెనీ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌.. కిషోర్‌ బియానీ ప్రమోట్‌ చేస్తున్న ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్‌ విభాగాలను కొనుగోలు చేయను న్నట్టు ఆగస్టు 29న ప్రకటించిన సంగతి విదితమే. ఈ డీల్‌ విలువ రూ.24,713 కోట్లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top