
ఏటా 11.7 శాతం వృద్ధి
వరల్డ్‌ప్యానెల్ ఇండియా అధ్యయనం
న్యూఢిల్లీ: దేశీయంగా ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో 12 కేటగిరీల ఆహార, పానీయాలకు సంబంధించి ఆరోగ్యకరమైన ఫుడ్, బెవరేజెస్‌కి డిమాండ్ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో వీటి మార్కెట్ 11.7 శాతం పెరిగి రూ. 63,093 కోట్లకు చేరింది. నూడుల్స్, టీ, బాటిల్డ్ సాఫ్ట్ డ్రింక్స్, ఆటా, బిస్కట్లు/కుకీస్, నూనె/నెయ్యి/వనస్పతి, ఉప్పు, రెడీ టు కుక్ మిక్స్‌లు, ఐస్‌క్రీమ్‌లు మొదలైనవి వీటిలో ఉన్నాయి.
వరల్డ్‌ప్యానెల్ ఇండియా నిర్వహించిన మెయిన్‌స్ట్రీమింగ్ హెల్త్ 2025 అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 87.9 శాతం భారతీయ కుటుంబాలు గత ఏడాది వ్యవధిలో ఏదో ఒక హెల్త్ ప్రోడక్టును కొనుగోలు చేశాయి. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి కుటుంబాలు 96 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లోను ఈ ధోరణి వేగం పుంజుకుంటోంది.
నివేదికలో మరిన్ని విశేషాలు..
→ ఆటా (పిండి), ఉప్పు, వంటనూనె/నెయ్యి, టీ లాంటి ఉత్పత్తులకు సంబంధించి 80 శాతం కుటుంబాలు ఆరోగ్యకరమైన వేరియంట్ల వైపు మొగ్గు చూపుతున్నాయి.
→ కేటగిరీల వారీగా వార్షికంగా అధిక వృద్ధి సాధిస్తున్న ఉత్పత్తుల్లో రెడీ టు కుక్ మిక్స్‌లు (46 శాతం), సాల్టీ స్నాక్స్ (34 శాతం), బాటిల్డ్ సాఫ్ట్ డ్రింక్స్ (29 శాతం), బిస్కట్లు (19 శాతం) ఉన్నాయి. వినియోగదారులు ఒకసారి ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులకు అలవాటుపడితే వాటి వినియోగాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు.
→ ఆరోగ్యమనేది ఒక ట్రెండ్‌గా కన్నా వినియోగదారుల రోజువారీ అలవాట్లలో భాగంగా మారుతోంది.
→ ఆరోగ్యకరమైన ఉత్పత్తుల కోసం 22 శాతం అధికంగా చెల్లించేందుకు కూడా కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటున్నారు. సామాజికంగా–ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా 17 శాతం అధికంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉంటున్నారు.
→ టీ, బాటిల్డ్ సాఫ్ట్ డ్రింకులకు అత్యధికంగా ప్రీమియం రేట్లు ఉంటున్నాయి.
→ మధుమేహం, కార్డియాక్ ..హైపర్‌టెన్షన్ సమస్యలు ఉన్న కుటుంబాలు మరింత ఎక్కువగా హెల్త్ ప్రోడక్టులను ఉపయోగిస్తున్నాయి. అయితే, వ్యాధులపరమైన సవాళ్లు లేని కుటుంబాల్లో కూడా క్రమంగా వీటి వినియోగం పెరుగుతోంది.