హెచ్‌డీఎఫ్‌సీ పనితీరు భళా

HDFC Q4 net profit surges 42 per cent - Sakshi

నికర లాభం 31 శాతం అప్‌

క్యూ4లో రూ. 5,669 కోట్లు

షేరుకి రూ. 23 తుది డివిడెండ్‌

మరో మూడేళ్లు మిస్త్రీకి బాధ్యతలు

ముంబై: ప్రయివేట్‌ రంగ మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 31 శాతం ఎగసి రూ. 5,669 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 4,342 కోట్లు ఆర్జించింది. ఇక క్యూ4లో స్టాండెలోన్‌ నికర లాభం 42 శాతం జంప్‌చేసి రూ. 3,180 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 23 చొప్పున తుది డివిడెండును హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు ప్రకటించింది. ఇందుకు జూన్‌ 1 రికార్డ్‌ డేట్‌గా
తెలియజేసింది.  

పూర్తి ఏడాదికి
మార్చితో ముగిసిన పూర్తిఏడాదికి హెచ్‌డీఎఫ్‌సీ స్టాండెలోన్‌ నికర లాభం రూ. 17,770 కోట్ల నుంచి రూ. 12,027 కోట్లకు వెనకడుగు వేసింది. ఈ కాలంలో రూ. 2,788 కోట్లమేర పన్ను చెల్లింపులను చేపట్టింది. కాగా.. బంధన్‌ బ్యాంకుతో గృహ ఫైనాన్స్‌ విలీనం కారణంగా లాభాలను పోల్చతగదని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. గతేడాది తొలి అర్ధభాగంలో వ్యక్తిగత రుణ విభాగం మందగించినట్లు కంపెనీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి మిస్త్రీ పేర్కొన్నారు. అయితే ద్వితీయార్ధంలో పటిష్ట రికవరీ నమోదైనట్లు తెలియజేశారు. దీంతో అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య వ్యక్తిగత రుణ మంజూరీ 42 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఇది క్యూ4లో మరింత అధికమై 60 శాతాన్ని తాకినట్లు తెలియజేశారు. కాగా.. బోర్డు ఎంపికమేరకు 2021 మే 7 నుంచి మిస్త్రీ మరో మూడేళ్లపాటు ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

మార్జిన్లు 3.5 శాతం
మార్చికల్లా హెచ్‌డీఎఫ్‌సీ నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతంగా నమోదయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 22.2 శాతాన్ని తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.99 శాతం నుంచి 1.98 శాతానికి స్వల్పంగా తగ్గాయి. ప్రొవిజన్లు రూ. 13,025 కోట్లకు చేరాయి. వ్యక్తిగత పోర్ట్‌ఫోలియో ఎన్‌పీఏలు 0.99 శాతంకాగా, వ్యక్తిగతేతర రుణ విభాగంలో 4.77 శాతంగా నమోదయ్యాయి. కోవిడ్‌–19 నేపథ్యంలో మార్గదర్శకాలకు మించి రూ. 7,534 కోట్లమేర అదనపు ప్రొవిజన్లు చేపట్టినట్లు మిస్త్రీ వెల్లడించారు.  

షేరు అప్‌: షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.5 శాతం బలపడి రూ. 2,491 వద్ద ముగిసింది. తొలుత రూ. 2,507 వరకూ జంప్‌చేసింది. ఎన్‌ఎస్‌ఈ,
బీఎస్‌ఈలో కలిపి సుమారు 50.54 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top