వాహన రుణగ్రహీతలకు ‘జీపీఎస్‌’ కమీషన్‌ వెనక్కి

HDFC Bank to refund GPS device charges to customers - Sakshi

నెల రోజుల్లో ఖాతాల్లో జమ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రకటన

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద వాహనరుణాలు తీసుకుని, జీపీఎస్‌ పరికరాలను సైతం కొనుగోలు చేసిన కస్టమర్లకు ‘కమీషన్ల’ను త్వరలో తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. 2013–14 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరం మధ్య వాహన రుణాలు తీసుకున్న కస్టమర్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జీపీఎస్‌ పరికరాలను కూడా కొనుగోలు చేయించింది. ఆయా పరికరాల విక్రయం రూపంలో కమీషన్లను సంపాదించుకుంది. వాహన రుణాల్లో అవకతవకలు జరిగినట్టు గతేడాది బ్యాంకు చీఫ్‌గా ఉన్న ఆదిత్యపురి సైతం అంగీకరించారు. దీనిపై ఆర్‌బీఐ రూ.10 కోట్ల జరిమానా కూడా విధించింది.

ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 2013–14 నుంచి 2019–20 మధ్య వాహన రుణాలు తీసుకుని, జీపీఎస్‌ పరికరాలనూ కొనుగోలు చేసిన వారికి కమీషన్లను తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. బ్యాంకు వద్ద నమోదై ఉన్న కస్టమర్ల ఖాతాలకు వచ్చే 30 రోజుల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్టు తెలిపింది. దీనిపై కస్టమర్లు బ్యాంకు శాఖలను సంప్రదించొచ్చని సూచించింది. వాహన రుణ దరఖాస్తును ఆమోదించే సమయంలో కస్టమర్‌తో రూ.18,000 విలువ చేసే జీపీఎస్‌ పరికరాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొనుగోలు చేయించిందన్నది ఆరోపణ. నిబంధనల ప్రకారం బ్యాంకు లు ఇతర ఉత్పత్తులను విక్రయించరాదు.  

సేవల ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం
అదే పనిగా డిజిటల్‌ సేవల్లో అంతరాయాలు ఏర్పడుతుండడంతో.. నూతన క్రెడిట్‌ కార్డులు మంజూరు చేయకుండా ఆర్‌బీఐ విధించిన నిషేధం నుంచి బయటపడేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి రమేష్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సేవల్లో అంతరాయాలు ప్రస్తుత పాత వ్యవస్థ కారణంగానే చోటుచేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తరచూ సాంకేతిక అవాంతరాలు ఏర్పడుతుండడంతో కొత్తగా క్రెడిట్‌ కార్డులు, నూతన డిజిటల్‌ సేవలు ప్రారంభించకుండా 2020 డిసెంబర్‌లో ఆర్‌బీఐ నిషేధం విధించడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top