అవినీతిని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆప్షన్–3 ఇళ్ల బిల్లుల మంజూరుకు ఫిజికల్ వెరిఫికేషన్
కింది నుంచి పైదాకా అధికారుల సంతకాలు కావాలని వింత నిబంధన
గత ప్రభుత్వంలో ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా బిల్లుల చెల్లింపులు
రూ.50 కోట్ల మేర బిల్లులను నిలిపేసిన చంద్రబాబు ప్రభుత్వం
కమీషన్ల కోసం అర్రులు చాస్తున్న టీడీపీ నేతలు
ఎక్కడికక్కడ నిలిచిపోయిన పేదల ఇంటి నిర్మాణాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి రోజురోజుకు పెచ్చరిల్లుతోంది. కమీషన్‌లే లక్ష్యంగా కొత్త విధానాలు తెస్తోంది. రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణ బిల్లుల మంజూరులోనూ అక్రమాలకు తెరలేపింది. గృహ నిర్మాణ శాఖలో ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణ బిల్లుల మంజూరుకు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణ పురోగతి ఆధారంగా ఆన్‌లైన్‌లోనే బిల్లులు నమోదు చేసి, వివిధ దశల్లో ఆన్‌లైన్ వెరిఫికేషన్ అనంతరం నిర్మాణ ఏజెన్సీలకు నిధులు మంజూరు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితికి పూర్తి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
నిమిషాల్లో అయ్యే పనికి రోజులు..
పేదల ఇంటి నిర్మాణం పురోగతి ఆధారంగా వివిధ దశలుగా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుంది. బేస్మెంట్, లింటెల్, స్లాబ్ ఇలా ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా బిల్లు మంజూరు కోసం క్షేత్ర స్థాయిలో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ ఉంటారు. గతంలో అయితే ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం డివిజన్, జిల్లా, గృహ నిర్మాణ సంస్థలోని ఇంజినీరింగ్, ఫైనాన్స్ ఇలా వివిధ దశల్లో ఆన్‌లైన్‌లో బిల్లులను పరిశీలించి, ధ్రువీకరించిన అనంతరం చెల్లింపులు ఆటోమేటిక్‌గా అయిపోయేవి.
ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం లేఅవుట్‌ల వారీగా బిల్లులను డివిజినల్, జిల్లా, గృహ నిర్మాణ సంస్థలో వివిధ దశల్లో అధికారులు ఫిజికల్‌గా సర్టిఫై చేయాలనే వింత నిబంధన తెచి్చంది. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో అధికారుల చుట్టూ తిరిగి, వారితో సంతకాలు చేయించుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నామని ఏజెన్సీల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు.
కొందరు అధికారులు బిల్లులు సర్టిఫై చేయడానికి లంచాలు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిమిషాలు, గంటల వ్యవధిలో అయిపోయిన బిల్లుల వెరిఫికేషన్ ప్రక్రియ.. ఇప్పుడు ఒక్కో దశకి 10 రోజుల పైనే పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందుకు సాగని నిర్మాణాలు..
కమీషన్‌లు, లంచాల కోసం వింత విధానాలతో పచ్చనేతలు బిల్లులను పెండింగ్‌లో పెట్టేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.50 కోట్ల మేర నిర్మాణ సంస్థలకు బకాయి పడింది. పెద్ద ఎత్తున బిల్లులు నిలిచిపోవడంతో సంస్థలు ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆపేశాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో 31.19 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇంటి స్థలాలు పంపిణీ చేశారు.
జగనన్న కాలనీల్లో 19 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలు చేపట్టారు. ఉచితంగా స్థలం ఇచ్చి, ఆర్థిక సాయం చేసినప్పటికీ ఇంటిని నిరి్మంచుకోలేని పేదల కోసం ఆప్షన్–3 విధానం ప్రవేశపెట్టారు. ఈ విధానంలో 2.68 లక్షల మందిని ఎంపిక చేసి, ఏజెన్సీల ద్వారా ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆప్షన్–3 విధానం చంద్రబాబు గద్దెనెక్కాక పూర్తిగా పక్కదారి పట్టింది.
కమీషన్‌ల కోసం పచ్చ గద్దలు నిర్మాణ సంస్థలను వేధింపులకు గురిచేస్తున్నాయి. ఏజెన్సీల యజమానులతో టీడీపీ నాయకులు కమీషన్‌లు డిమాండ్ చేస్తున్నారు. వీరు డిమాండ్ చేసినంత కమీషన్ ఇవ్వడానికి సిద్ధమైన వారికే బిల్లులు విడుదల చేయాలంటూ అధికారులకు సిఫార్సులు చేస్తున్నారు.


