విదేశాల్లోనూ దూసుకెళ్తాం,ఆ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు భారీ డిమాండ్!

Hcl Tech Roshni Nadar Eyes Double Digit Growth - Sakshi

ముంబై: గత రెండేళ్లుగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి (ఐటీ) డిమాండ్‌ భారీ స్థాయిలోనే ఉందని ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ రోష్నీ నాడార్‌ మల్హోత్రా తెలిపారు. అంతర్జాతీయంగా క్లయింట్లు డిజిటల్‌ వైపు మళ్లడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని వివరించారు.

ఈ నేపథ్యంలో తమ సంస్థ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించగలదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. క్లౌడ్, డిజిటల్‌ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు కొత్త మార్కెట్లలోకి కూడా విస్తరించడంపై హెచ్‌సీఎల్‌ టెక్‌ దృష్టి సారిస్తున్నట్లు రోష్నీ తెలిపారు. ‘అయిదేళ్ల తర్వాత చూస్తే మేము మరిన్ని మార్కెట్లలోకి విస్తరిస్తాం. మరింత మంది కస్టమర్లు ఉంటారు. సీఈవో విజయ్‌కుమార్‌ చెప్పినట్లుగా మేము రెండంకెల స్థాయిలో వృద్ధిని కొనసాగిస్తాం‘ అని ఆమె పేర్కొన్నారు.

ఇందుకోసం ఉత్తర ఆసియా, సెంట్రల్‌ అమెరికా, తూర్పు యూరప్, ఆఫ్రికా దేశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. యూరప్, అమెరికా వంటి పెద్ద మార్కెట్లలో క్లయింట్లతో మాట్లాడినప్పుడు వారు మరింత వేగంగా డిజిటలీకరణను ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తున్నట్లు వెల్లడైందని రోష్నీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 22,597 కోట్లకు చేరింది. నికర లాభం రూ. 1,102 కోట్ల నుంచి రూ. 3,593 కోట్లకు ఎగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top