జీఎస్‌టీ వసూళ్లు భళా! | GST Collections Rise 6. 2 Percent To Touch Rs 1. 84 Lakh Crore In June | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ వసూళ్లు భళా!

Jul 2 2025 1:10 AM | Updated on Jul 2 2025 10:02 AM

GST Collections Rise 6. 2 Percent To Touch Rs 1. 84 Lakh Crore In June

జూన్‌లో రూ.1.84 లక్షల కోట్లు 

6.2% వృద్ధి

న్యూఢిల్లీ: స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు జూన్‌లో రూ. 1.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూన్‌లో నమోదైన రూ. 1,73,813 కోట్లతో పోలిస్తే ఇది 6.2 శాతం అధికం. ఈ ఏడాది మే నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 2.01 లక్షల కోట్లు. ఏప్రిల్‌లో ఇవి రికార్డు స్థాయి గరిష్టమైన రూ. 2.37 లక్షల కోట్లకు ఎగిశాయి. ‘నిబంధనల భారాన్ని తగ్గించి, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు వ్యాపారాల నిర్వహణను గణనీయంగా మెరుగుపర్చేందుకు జీఎస్‌టీ దోహదపడింది.

ఈ ప్రస్థానంలో సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించేలా రాష్ట్రాలను కూడా సమాన భాగస్వాములుగా చేయడంతో పాటు ఆర్థిక వృద్ధికి శక్తివంతమైన చోదకంగా మారింది‘ అని జీఎస్‌టీని ప్రవేశపెట్టి ఎనిమిదేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

జూన్‌ గణాంకాల ప్రకారం .. 
జూన్‌లో దేశీయ లావాదేవీలపై జీఎస్‌టీ వసూళ్లు 4.6 శాతం పెరిగి రూ. 1.38 లక్షల కోట్లకు, దిగుమతులపై రూ. 11.4 శాతం పెరిగి రూ. 45,690 కోట్లకు చేరాయి.  
స్థూల కేంద్ర జీఎస్‌టీ ఆదాయాలు రూ. 34,558 కోట్లుగా, రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయాలు రూ. 43,268 కోట్లుగా, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ. 93,280 కోట్లుగా, సెస్సుల నుంచి ఆదాయం రూ.13,491 కోట్లుగా నమోదయ్యాయి.  
జూన్‌లో మొత్తం రిఫండ్‌లు 28 శాతం పెరిగి రూ. 25,491 కోట్లకు, నికర జీఎస్‌టీ వసూళ్లు 3.3 శాతం పెరిగి రూ. 1.59 లక్షల కోట్లకు చేరాయి.

ఐదేళ్లలో డబుల్‌...
2024–25లో రూ.22.08 లక్షల కోట్లు 
2020–21లో ఇవి రూ.11.37 లక్షల కోట్లే 
150 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారులు
వస్తు సేవల పన్ను రూపంలో (జీఎస్‌టీ) ఆదాయం గత ఐదు ఆర్థిక సంవత్సరాల కాలంలో రెట్టింపైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జీఎస్‌టీ రూపంలో రూ.22.08 లక్షల కోట్ల ఆదా యం సమకూరింది. అంతకుముందు ఆర్థి క సంవత్సరం (2023–24)లో ఆదాయం రూ.20.18 లక్షల కోట్లతో పోల్చితే 9.4 శాతం పెరిగింది. కాగా, 2017 జూలై 1న తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల వ్యవధిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.7.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ ఆదాయం రూ.11.37 లక్షల కోటత్లో పోల్చితే రెట్టింపైంది.

2022–23 సంవత్సరంలో రూ.18.08 లక్షల కోట్లు, 2021–22లో రూ.14.83 లక్షల కోట్ల ఆదాయం వసూలైంది. 2024–25 సంవత్సరంలో నెలవారీ సగటు ఆదాయం రూ.1.84 లక్షల కోట్ల చొప్పున ఉంది. 2023–24లో ఇది 1.68 లక్షల కోట్లుగా ఉంది. 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి రాగా, 8 వసంతాలను పూ ర్తి చేసుకుంది. ఈ ఎనిమిదేళ్లలో జీఎస్‌టీ కింద పన్ను చెల్లింపుదారులు 65 లక్షల నుంచి 1.51 కోట్లకు పెరిగారు. 17 రకాల స్థానిక పన్నులు, 13 రకాల సెస్సుల స్థా నంలో 5 రకాల పన్ను శ్లాబులతో జీఎస్‌టీ ని తీసుకురావడం తెలిసిందే. 2025 ఏప్రిల్‌ నెలకు వసూలైన రూ.2.37 లక్షల కోట్లు నెలవారీ అత్యధిక రికార్డుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement