త్వరలో టాటాల చేతికి ఎయిరిండియా

డిసెంబర్‌కల్లా డిజిన్వెస్ట్‌మెంట్ పూర్తికి చాన్స్
Rajiv Bansal About Air India Disinvestment: ఎయిరిండియాలో వాటా విక్రయ ప్రక్రియను డిసెంబర్‌కల్లా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సల్ పేర్కొన్నారు. నష్టాలతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన కంపెనీ ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను త్వరితగతిన పూర్తి చేసే సన్నాహాల్లో ప్రభుత్వమున్నట్లు తెలియజేశారు.
ఎయిరిండియా కొనుగోలు రేసులో టాటా గ్రూప్ కంపెనీ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం గత నెల 25న ఎయిరిండియా విక్రయానికి టాటా సన్స్‌తో రూ. 18,000 కోట్ల విలువైన వాటా కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా టాటా గ్రూప్ రూ. 2,700 కోట్లు నగదు రూపేణా చెల్లించడంతోపాటు.. మరో రూ. 15,300 కోట్ల రుణాలను టేకోవర్ చేయనుంది. అంతేకాకుండా ఎయిరిండియాతోపాటు చౌక ధరల సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను, ఏఐఎస్‌ఏటీఎస్‌లో ఎయిరిండియాకుగల 50 శాతం వాటాను సైతం సొంతం చేసుకోనుంది. కంపెనీ నెలకు రూ. 600 కోట్లకుపైగా నష్టాలు నమోదు చేస్తోంది.