అయ‍్యయ్యో గూగుల్‌ ‘బార్డ్‌’ ఎంత పనిచేసింది: 100 బిలియన్ డాలర్లు మటాష్‌! 

Google shares lose more than 100 billion dollars after AI chatbot Bard flubs answer in ad - Sakshi

అటు చాట్‌జీపీటీ దూకుడు ఇటు గూగుల్‌కు భారీ షాక్‌

‘బార్డ్’ అడ్వర్‌టైజ్‌మెంట్‌లో  పొరపాటు

 ఆల్ఫాబెట్‌ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు

సాక్షి,ముంబై: సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆదిలోనే హంసపాదు అన్నట్టు చిన్న పొరపాటుకు బిలియన్‌ డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’కి పోటీగా ‘బార్డ్’ను రంగంలోకి దింపిన గూగుల్‌కు చేదు అనుభవం ఎదురైంది.  

ఇటీవల ప్రకటించిన చాట్‌బాట్‌ బార్డ్‌కు సంబంధించిన  ఒక  అడ్వర్‌టైజ్‌మెంట్‌లో  భారీ తప్పిదం కారణంగా గూగుల్ మాతృసంస్థ  ఆల్పాబెట్ షేర్ ధర బుధవారం భారీ ఒడిదుడుకులకు లోనైంది. అమెరికా ఎక్స్ఛేంజీలలో ఆల్ఫాబెట్ షేర్లు 8 శాతం కుప్పకూలింది.  ఫలితంగా  గూగుల్‌  ఒక్క రోజులోనే ఏకంగా 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మేర మార్కెట్ విలువను కోల్పోయింది. 

రాయిటర్స్ తొలుత ‘బార్డ్’ యాడ్‌లోని తప్పిదాన్ని గుర్తించింది. సౌరవ్యవస్థ వెలుపలి గ్రహాల చిత్రాలను తొలిసారిగా ఏశాటిలైట్  తీసిందన్న  ప్రశ్నకు బార్డ్ సరైన సమాధానం ఇవ్వడంలో తప్పులో కాలేసింది.  "జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని సమాధానం చెప్పింది. కానీ నాసా ధృవీకరించినట్లుగా, 2004లో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ  వెరీ లార్జ్ టెలిస్కోప్ (VLT) ద్వారా ఎక్సోప్లానెట్‌ల తొలి చిత్రాలను తీసింది. బార్డ్‌కు సంబంధించి  గూగుల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన చిన్న GIF వీడియోను  "లాంచ్‌ప్యాడ్"గా అభివర్ణించింది. ఈ షార్ట్ వీడియోలోనే ఈ పొరపాటు దొర్లింది. 

మరోవైపు మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీతో దూసుకు రావడంతో గూగుల్  బార్డ్ వైపు ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని,  మార్కెట్‌ గూగుల్‌కు భారీ శిక్ష విదించిందని  ట్రిపుల్ డి ట్రేడింగ్‌ మార్కెట్ నిర్మాణ విశ్లేషకుడు డెన్నిస్ డిక్  వ్యాఖ్యానించారు. 

గూగుల్ గత కొన్నివారాలుగా సెర్చ్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హడావిడిగా ఇచ్చిన డెమో సమయంలో తప్పు సమాధానాన్ని పోస్ట్ చేయడం ఇబ్బందికరమైన గందరగోళానికి తీసిందని సీనియర్ సాఫ్ట్‌వేర్ విశ్లేషకుడు గిల్ లూరియా అన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top