కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..? | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..?

Published Fri, Jan 5 2024 11:13 AM

Google Bard Innovations On 2024 About Chips On Human Mind - Sakshi

కొత్త సంవత్సరంలో రాబోయే ఆసక్తికర అంశాల గురించి కృత్రిమమేధ ఏం చెబుతుందో వెతికే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా మనిషి శరీరానికి యంత్రాలు అమర్చే ప్రక్రియకు 2024 వేదిక అవుతుందని ‘గూగుల్‌ బార్డ్‌’ అంచనా వేసింది. దాంతో మానవులు అత్యంత సమర్థవంతంగా మారే అవకాశం ఉందని తెలిపింది. మెదడులో అమర్చే చిప్‌లతో కంప్యూటర్‌కు అనుసంధానం కాగలిగే టెక్నాలజీ రూపొందుతుందని పేర్కొంది. 

గూగుల్‌ బార్డ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మనుషుల మెదడు–కంప్యూటర్‌ అనుసంధానికి వీలుకల్పించే ‘బ్రెయిన్‌–కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (బీసీఐ)’లు అభివృద్ధి చెందుతాయి. దీని సాయంతో కృత్రిమ చేతులు, కాళ్లు వంటి అవయవాల (బయోనిక్‌ లింబ్స్‌)ను, ఇతర పరికరాలను నేరుగా మెదడుతో నియంత్రించడానికి వీలవుతుంది. భారీ బరువులను ఎత్తడం, అత్యంత వేగంగా పరుగెత్తడం, కష్టమైన పనులు చేయడం, మిలటరీ ఆపరేషన్స్‌ వంటివి సాధ్యమవుతాయి. 

అవయవాలు కోల్పోయినవారు, పక్షవాతం వచ్చిన వారు తిరిగి సాధారణ జీవితం గడపవచ్చు. మెదడు-కంప్యూటర్లు కలిసి సృజనాత్మకత, మేధోశక్తి పెరుగుతుందని గూగుల్‌ బార్డ్‌ ద్వారా తెలిసింది. అయితే ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ సంస్థ రూపొందించిన బ్రెయిన్‌ చిప్‌లను ఈ ఏడాదే మనుషులకు ప్రయోగాత్మకంగా అమర్చి పరిశీలించనుంది.

న్యూరాలింక్‌ అధునాతన ‘బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ (బీసీఐ) సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు చేరుకుంది. నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఇది సాయపడుతుందని మస్క్‌ చెబుతున్నారు. అంతిమంగా దీనివల్ల ‘మానవాతీత శక్తి’ లభిస్తుందంటున్నారు. ఆయన ప్రణాళికల్లో సగం అమలైనా.. మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరతీస్తుంది. 

మన మెదడు.. శరీరంలోని వివిధ అవయవాలకు నాడీ కణాల (న్యూరాన్లు) ద్వారా సంకేతాలను పంచుకుంటుంది. ఈ కణాలు పరస్పరం సంధానమై, ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తాయి. న్యూరో ట్రాన్స్‌మిటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి కమ్యూనికేట్‌ చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో విద్యుత్‌ క్షేత్రం ఏర్పడుతుంది.

ఇదీ చదవండి: అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్‌.. ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

మెదడులోని పలు న్యూరాన్లకు సమీపంలో ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్‌ సంకేతాలను రికార్డు చేయడం ‘న్యూరాలింక్‌’ ప్రాజెక్టు ఉద్దేశం. దీని ద్వారా వాటిని ఆధునిక యంత్రాల నియంత్రణకు ఉపయోగించాలని ఆ సంస్థ భావిస్తోంది. నేరుగా చెప్పాలంటే మెదడులోని ఆలోచన శక్తి సాయంతో మనం యంత్రాలతో అనుసంధానం కావొచ్చు. అలాగే నాడీ, కదలికలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయవచ్చు.

 
Advertisement
 
Advertisement