భారత్‌లో గూగుల్‌ స్టార్టప్‌ స్కూల్‌

Google announces Startup School India for small-city entrepreneurs - Sakshi

చిన్న పట్టణాల్లో 10వేల స్టార్టప్‌లకు తోడ్పాటు

న్యూఢిల్లీ: అంకుర సంస్థలు ప్రారంభ దశలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, నిలదొక్కుకునేందుకు తోడ్పాటు అందించే దిశగా టెక్‌ దిగ్గజం గూగుల్‌.. భారత్‌లో స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో దాదాపు 10,000 స్టార్టప్‌లకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం వర్చువల్‌గా తొమ్మిది వారాల పాటు ఉంటుంది.

మెరుగైన ఉత్పత్తిని సమర్థంగా రూపొందించేందుకు వ్యూహాలు, కొత్తగా ఇంటర్నెట్‌కు పరిచయమయ్యే యూజర్ల కోసం యాప్‌ల రూపకల్పన, కొత్త యూజర్లను దక్కించుకునేందుకు పాటించాల్సిన వ్యూహాలు మొదలైన వాటిలో ఇందులో శిక్షణ పొందవచ్చు. అలాగే స్టార్టప్‌ వ్యవస్థకు సంబంధించిన పలువురు దిగ్గజాలతో చర్చా కార్యక్రమాలు మొదలైనవి కూడా ఉంటాయి. దాదాపు 70,000 పైచిలుకు అంకుర సంస్థలతో స్టార్టప్‌ల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది.

హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల నుంచే కాకుండా చిన్న పట్టణాల నుంచి కూడా అనేకానేక స్టార్టప్‌లు వస్తున్నాయి. అయితే, 90 శాతం స్టార్టప్‌లు తొలి అయిదేళ్లలోనే మూతబడుతున్నాయి. ఖర్చులపై అదుపు లేకపోవడం, డిమాండ్‌ను సరిగ్గా అంచనా వేసుకోలేకపోవడం, సారథ్యం సరిగ్గా లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయని గూగుల్‌ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది. ఇలాంటి సవాళ్లను అధిగమించి అంకుర సంస్థలు నిలదొక్కుకోవడంలో సహకరించే లక్ష్యంతోనే స్టార్టప్‌ స్కూల్‌ను తలపెట్టినట్లు పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top