బంగారం- వెండి.. దూకుడు

Gold, Silver prices gain 3rd day in MCX and New York Comex - Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 52,042కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 68,600 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1993 డాలర్లకు

29 డాలర్లను అధిగమించిన ఔన్స్‌ వెండి ధర

వరుసగా మూడో రోజు బంగారం, వెండి ధరలు మెరుస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు, సావరిన్‌ ఫండ్స్‌ తదితర సంస్థలు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం ఇందుకు దోహదం చేస్తోంది. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ మరోసారి ధరలు బలపడ్డాయి. ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే ప్రాధాన్యమివ్వనున్నట్లు యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్‌ పేర్కొనడంతో వారాంతాన బంగారం, వెండి ధరలు ఆటుపోట్ల నుంచి బయటపడి ర్యాలీ బాట పట్టిన సంగతి తెలిసిందే. 

తాజాగా.. 
గత రెండు రోజుల జోరును కొనసాగిస్తూ బంగారం, వెండి.. ధరలు కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం  రూ. 341 బలపడి రూ. 52,042 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 1,282 ఎగసి రూ. 68,600 వద్ద కదులుతోంది. 

సోమవారం ప్లస్‌లో
వరుసగా రెండో రోజు సోమవారం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 253 పెరిగి రూ. 51,701 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,875 వద్ద గరిష్టాన్ని తాకగా.. 51,460 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,342 జంప్‌చేసి రూ. 67,318 వద్ద నిలిచింది. ఒక దశలో 68,614 వరకూ బలపడిన వెండి తదుపరి రూ. 66,178 వరకూ పతనమైంది. 

కామెక్స్‌లోనూ..
మూడో రోజూ న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు మెరుస్తున్నాయి. ప్రస్తుతం ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.8 శాతం లాభపడి 1,993 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 1 శాతం బలపడి 1987 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి సైతం ఔన్స్ 1.5 శాతం ఎగసి 29 డాలర్లను అధిగమించి ట్రేడవుతోంది. ఆగస్ట్‌ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top