
క్యూ4లో రూ. 253 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) నష్టం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 253 కోట్లకు పెరిగింది. అంతక్రితం క్యూ4లో నష్టం రూ. 168 కోట్లు. ఇక సమీక్షాకాలంలో ఆదాయం రూ. రూ. 2,570 కోట్ల నుంచి రూ. 2,977 కోట్లకు చేరింది. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నష్టం రూ. 829 కోట్ల నుంచి రూ. 817 కోట్లకు తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో అభివృద్ధి చేస్తున్న విమానాశ్రయం పనులు మార్చి ఆఖరు నాటికి సుమారు 69 శాతం పూర్తయినట్లు జీఏఎల్ తెలిపింది.
నియంత్రణ సంస్థ ఏఈఆర్‌ఏ కొత్తగా జారీ చేసిన టారిఫ్ ఆర్డరుతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఆదాయం, లాభదాయకత మరింత మెరుగుపడతాయని పేర్కొంది. ఈ ఆర్డరు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచి్చంది. దీన్ని గత ఆర్థిక సంవత్సరంలోనే జారీ చేసి ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవని సంస్థ వివరించింది. జీఏఎల్ లో భాగమైన సంస్థలు హైదరాబాద్, ఢిల్లీ, మోపా (గోవా) విమానా శ్రయాలను నిర్వహిస్తున్నాయి. అటు ఇండొనేషియాలోని మెడాన్ ఎయిర్‌పోర్ట్, గ్రీస్‌లోని క్రెటే ఎయిర్‌పోర్టు కూడా కంపెనీ నిర్వహణలో ఉన్నాయి.
శుక్రవారం బీఎస్‌ఈలో జీఏఎల్ షేరు రెండు శాతం పైగా క్షీణించి రూ. 86.83 వద్ద క్లోజయ్యింది.