
ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ గత ఆర్థిక సంవత్సరం (2024–25) మార్చి త్రైమాసికంలో రూ.325 కోట్ల స్టాండెలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరం (2023–24) క్యూ4లో ప్రకటించిన రూ.119 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. నిర్వహణ ఆదాయం మాత్రం రూ.1,719 నుంచి రూ.1,446 కోట్లకు తగ్గింది. ‘‘మార్చి క్వార్టర్‌లో రికార్డు స్థాయి నికర లాభాన్ని ఆర్జించగలిగాము. ప్రమోటర్ గ్రూప్ క్యూ4లో రూ.294 కోట్లు సహా మొత్తం రూ.500 కోట్లు మూలధనాన్ని సమకూర్చింది.
ఇది కంపెనీ దీర్ఘకాలిక దృష్టి, సామర్థ్యంపై నమ్మకాన్ని సూచిస్తుంది’’ అని స్పైస్‌జెట్ తెలిపింది. కంపెనీ పూర్తి ఆర్థిక సంవత్సరానికిగానూ గత ఏడేళ్లలో తొలిసారి రూ.59 కోట్ల లాభాన్ని ప్రటించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.409 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. తాజాగా నిర్వహణ ఆదాయం 25% క్షీణించి రూ.7,050 కోట్ల నుంచి రూ.5,284 కోట్లకు దిగివచి్చంది. ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో వైమానిక పరిశ్రమ వారికి బాసటగా ఉంటుందన్నారు.