బంగారం డిమాండ్‌ పదిలం! | Sakshi
Sakshi News home page

బంగారం డిమాండ్‌ పదిలం!

Published Fri, Oct 29 2021 4:53 AM

Global Q3 gold demand down 7per cent at 831 tonnes ETF outflows - Sakshi

ముంబై: బంగారం డిమాండ్‌ మళ్లీ పుంజుకుంటోంది. 2021 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే పసిడి డిమాండ్‌ 47 శాతం పెరిగింది. పరిమాణంలో 139.1 టన్నులుగా నమోదయ్యింది. మహమ్మారి సవాళ్ల తగ్గి, ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారానికి తిరిగి వినియోగ డిమాండ్‌ ఏర్పడుతున్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. డబ్ల్యూజీసీ ఆవిష్కరించిన క్యూ3 గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ 2021 నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► 2020 సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశం మొత్తం డిమాండ్‌ 94.6 టన్నులు. అప్పటితో పోల్చితే 47 శాతం పెరిగి 139.1 టన్నులకు చేరింది. విలువ పరంగా, భారతదేశం మూడవ త్రైమాసిక బంగారం డిమాండ్‌ 37 శాతం పెరిగి రూ. 59,330 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం రూ.43,160 కోట్లు.

► ఇది తక్కువ బేస్‌ ఎఫెక్ట్‌ అలాగే సానుకూల వాణిజ్యం, వినియోగదారుల మనోభావాల మేళవింపును ఇది ప్రతిబింబిస్తుంది. వ్యాక్సినేషన్‌ విస్తృతి, ఆర్థిక కార్యకలాపాల్లో బలమైన పురోగతి బంగారం కొనుగోళ్లు భారీగా పెరగడానికి కారణం.  

► దేశవ్యాప్తంగా ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్నందున,  రిటైల్‌ డిమాండ్‌ కోవిడ్‌–పూర్వ స్థాయికి పుంజుకుంది. రాబోయే పండుగలు,  వివాహాల సీజన్‌తో బంగారం డిమాండ్‌  మరింత పెరిగే వీలుంది. బంగారానికి ఇంతటి డిమాండ్‌ నెలకొనడం కోవిడ్‌ మహమ్మారి సవాళ్లు విసరడం ప్రారంభించిన తర్వాత ఇదే మొదటిసారి.  

► డిజిటల్‌ బంగారానికి డిమాండ్‌ పలు రెట్లు పెరిగింది. వినూత్న సాంకేతిక చొరవలు,  ప్రముఖ ఆభరణాల యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ల వంటి అంశాలు ఆన్‌లైన్‌ కొనుగోళ్లను ఇష్టపడే కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల సంఖ్యను పెంచడానికి గణనీయంగా దోహదపడుతుండడం గమనార్హం.

► రాబోయే నెలల్లో కమోడిటీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రావాణా వ్యయాలు భారం పెరుగుతుంది. ఆయా అంశాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయవచ్చు. ఇది దీర్ఘకాలంలో బంగారం డిమాండ్‌ మరింత పటిష్టం కావడానికి కలిసివచ్చే అంశం.  

► సెప్టెంబర్‌  త్రైమాసికంలో దేశం మొత్తం ఆభరణాల డిమాండ్‌ 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరుకుంది.  2020 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ పరిమాణం 60.8 టన్నులు. విలువలో  ఆభరణాల డిమాండ్‌ 48 శాతం పెరిగి రూ.41,030 కోట్లకు చేరింది, ఇది ఏడాది క్రితం రూ.27,750 కోట్లు.  

► మూడవ త్రైమాసికంలో మొత్తం పెట్టుబడి డిమాండ్‌ 27 శాతం పెరిగి 42.9 టన్నులకు చేరుకుంది. 2020 అదే త్రైమాసికంలో ఈ డిమాండ్‌ 33.8 టన్నులు. విలువ పరంగా, జూలై–సెప్టెంబర్‌లో బంగారం ఇన్వెస్ట్‌మెంట్‌ డిమాండ్‌ 19 శాతం పెరిగి రూ.18,300 కోట్లకు చేరుకుంది.ఇది ఏడాది క్రితం రూ.15,410 కోట్లు.  

► సమీక్షా కాలంలో భారతదేశంలో రీసైకిల్‌ చేసిన మొత్తం బంగారం 50 శాతం క్షీణించి 20.7 టన్నులకు చేరుకుంది.  గత ఏడాది ఇదే కాలంలో 41.5 టన్నులు. బంగారం రీసైక్లింగ్‌లో 50 శాతం తగ్గుదలను పరిశీలిస్తే,  బంగారాన్ని విక్రయించడం కంటే బంగారాన్ని కలిగి ఉండాలనే బలమైన వినియోగదారు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది.  

► బలమైన సంస్థాగత మార్కెట్ల దన్నుతో బంగారంపై రుణాల మార్కెట్‌ కూడా భారీగా పెరుగుతుండడం గమనార్హం.

► పన్నులు లేకుండా మొత్తం నికర బులియన్‌ దిగుమతులు మూడవ త్రైమాసికంలో 187 శాతం పెరిగి 255.6 టన్నులకు చేరింది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ పరిమాణం 89 టన్నులు.  

► మూడో త్రైమాసికంలో బంగారం ధర సగటున 10 గ్రాములకు రూ.42,635గా ఉంది.  2020 ఇదే త్రైమాసికంలో ఈ ధర రూ.45,640. 2021 ఏప్రిల్‌–జూన్‌లో సగటు ధర రూ.43,076.  

► వివిధ కొనుగోలుదారు–విక్రేతల సమావేశాల సందర్భంలో వచ్చిన అభిప్రాయాలను, పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలనూ పరిశీలిస్తే నాల్గవ త్రైమాసికం పండుగ సీజన్‌లో పసిడి డిమాండ్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. దిగుమతులూ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  


అంతర్జాతీయంగా డౌన్‌
మరోవైపు అంతర్జాతీయంగా సెప్టెంబర్‌ త్రైమాసికంలో పసిడి డిమాండ్‌ 7 శాతం తగ్గింది. డిమాండ్‌ 831 టన్నులకు తగ్గినట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది. గోల్డ్‌ ఎక్ఛ్సేంజ్‌ ట్రేడెట్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌) నుంచి భారీగా డబ్బు వెనక్కు వెళ్లినట్లు గణాంకాలు వెల్లడించాయి. మూడవ త్రైమాసికంలో సగటున ఔన్స్‌ (31.1గ్రాములు) ధర 6 శాతం తగ్గి,  1,790 డాలర్లకు చేరింది.

2020 ఇదే కాలంలో ఈ ధర 1,900 డాలర్లు. ఆభరణాలకు డిమాండ్‌ 33 శాతం పెరిగి 443 టన్నులకు చేరింది. టెక్నాలజీలో పసిడి వినియోగం 9 శాతం పెరిగి 83.8 టన్నులకు ఎగసింది. సెంట్రల్‌ బ్యాంకులు తమ పసిడి నిల్వలను మొత్తంగా 69 టన్నులు పెంచుకున్నాయి. 2020 ఇదే కాలంలో 10 టన్నుల విక్రయాలు జరిపాయి. కాగా సరఫరాలు మాత్రం మూడు శాతం తగ్గి 1,279 డాలర్ల నుంచి 1,239 డాలర్లకు పడింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement