గణాంకాలు, ప్రపంచ పరిణామాలే దిక్సూచి! | Get the stock market experts views and advice | Sakshi
Sakshi News home page

గణాంకాలు, ప్రపంచ పరిణామాలే దిక్సూచి!

Oct 6 2025 5:21 AM | Updated on Oct 6 2025 7:48 AM

Get the stock market experts views and advice

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అభిప్రాయం

9న టీసీఎస్‌ ఫలితాలతో క్యూ2 షురూ..

విదేశీ ఇన్వెస్టర్ల ధోరణీ కీలకమే...

రూపాయి, ముడి చమురు కదలికలపైనా ఫోకస్‌  

న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలతో పాటు ఐటీ దిగ్గజం టీఎస్‌ఎస్‌తో బోణీ కానున్న రెండో త్రైమాసిక (క్యూ2) ఫలితాలు మన మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వరుసగా మూడు నెలల నుంచి అమ్మకాల బాటలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కార్యకలాపాలను కూడా మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయని చెప్పారు. మరోపక్క, జారుడు బల్లపై ఉన్న రూపాయి మారకం విలువ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల కదలికలు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. 

టీసీఎస్‌ బోణీ... 
కార్పొరేట్ల క్యూ3 (జూలై–సెపె్టంబర్‌) ఆర్థిక ఫలితాలు ఈ వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఫలితాలతో బోణీ కొట్టనుంది. ట్రంప్‌ సర్కారు హెచ్‌1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం, 25 శాతం అదనపు టారిఫ్‌ల మోత తదితర భారత్‌ వ్యతిరేక చర్యల నేపథ్యంలో క్యూ2 ఫలితాలపై, కంపెనీల భవిష్యత్తు అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. ‘క్యూ2 ఫలితాల సందర్భంగా టారిఫ్‌ల ప్రభావం, వీసా ఫీజుల పెంపు, డీల్స్, కంపెనీల వ్యయాలు, ఉద్యోగాల కోత, హైరింగ్‌ అవుట్‌లుక్‌ వంటి అంశాలపై టీసీఎస్‌ యాజమాన్యం చేసే వ్యాఖ్యలు ఐటీ రంగంలో పాటు మార్కెట్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది’ అని ఆన్‌లైన్‌ ట్రేడింగ్, వెల్త్‌ టెక్‌ సంస్థ ఎన్‌రిచ్‌ మనీ సీఈఓ పోన్ముడి ఆర్‌ అభిప్రాయపడ్డారు. 

గణాంకాలపై ఫోకస్‌.. 
‘టీసీఎస్‌ ఫలితాలకు తోడు హెచ్‌ఎస్‌బీసీ సర్వీస్‌ రంగం పీఎంఐ డేటా, బ్యాంకింగ్‌ రంగ రుణ, డిపాజిట్‌ వృద్ధి గణాంకాలు రానున్నాయి. టాటా క్యాపిటల్, ఎల్‌జీ బడా ఐపీఓలతో ప్రైమరీ మార్కెట్‌ కార్యకలాపాలు జోరందుకోనున్నాయి’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా చెప్పారు. కాగా, అమెరికాలో ఫెడర్‌ రిజర్వ్‌ ఇటీవలి పాలసీ భేటీ వివరాలు (మినిట్స్‌), నిరుద్యోగ గణాంకాలు, కన్జూమర్‌ సెంటిమెంట్‌ డేటా వంటి వాటిపై ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు ఫోకస్‌ చేసే అవకాశం ఉంది. కొనసాగుతున్న అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ కారణంగా కొన్ని కీలక ఆర్థిక గణంకాలు ఇప్పటికే ఆలస్యమయ్యయాని మిశ్రా పేర్కొన్నారు. 

గత వారమిలా... 
వరుసగా 8 రోజుల పాటు నష్టాల బాటలో సాగిన దేశీ మార్కెట్లకు ఆర్‌బీఐ పాలసీ కాస్త ఊరటనిచి్చంది. గురు, శక్రవారాల్లో ప్లస్‌లో నిలిచిన సూచీలు లాభాలతో వారాన్ని ముగించాయి. సెన్సెక్స్‌ 781 పాయింట్లు (0.97%), నిఫ్టీ 240 పాయింట్లు (0.97%) చొప్పున ఎగబాకాయి. కీలక రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించినప్పటికీ, రానున్న నెలల్లో రేట్ల కోతకు ఆస్కారం ఉందంటూ ఇచ్చిన సిగ్నల్స్‌ మార్కెట్‌ను మెప్పించింది. మరోపక్క, ఐపీఓ ఫైనాన్సింగ్, షేర్ల తనఖా రుణ పరిమితిని భారీగా పెంచడం కూడా ఇన్వెస్టర్లలో జోష్‌ నింపింది. ‘జీడీపీ వృద్ధి అంచనాలను పెంచడంతో పాటు పాలసీ సందర్భంగా ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచింది. ఇటీవలి కరెక్షన్‌ నుంచి మార్కెట్లు మళ్లీ సానుకూల పథంలోకి మారాయి’ అని జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు.

మెగా ఐపీఓ వారం..
పబ్లిక్‌ ఆఫర్ల వరదతో కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లను ఈ వారం మెగా ఐపీఓలు (దాదాపు రూ.27,000 కోట్లు) ముంచెత్తనున్నాయి. టాటా క్యాపిటల్‌ రూ.15,512 కోట్ల ఇష్యూతో పాటు (6న ప్రారంభమై 8న ముగుస్తుంది). దీని ప్రైస్‌ బ్యాండ్‌ను కంపెనీ రూ.310–326గా నిర్ణయించింది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఐపీఓ కూడా ఈ వారమే ప్రారంభమవుతోంది. దాదాపు రూ.11,607 కోట్ల ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 7న మొదలై 9న క్లోజవుతుంది. దీని ధరల శ్రేణి రూ.1,080–1,140. ఇవి కాకుండా రూబికాన్‌ రీసెర్చ్‌ రూ.1,377 కోట్ల ఇష్యూ అక్టోబర్‌ 9న షురూ కానుంది. ఇప్పటికే మొదలైన రూ.3,000 కోట్ల వియ్‌వర్క్‌ ఆఫర్‌ 7న ముగియనుంది. 2025లో ఇప్పటికే 78 ఐపీఓలు పూర్తవగా.. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు వరుస కట్టనున్నాయి.

ఎఫ్‌పీఐల రివర్స్‌ గేర్‌...
సెపె్టంబర్‌ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) అమ్మకాల జోరు పెంచారు. ఈ ఒక్క నెలలోనే రూ.23,885 కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మేశారు. దీంతో ఈ ఏడాది ఇప్పటిదాకా ఈక్విటీ మార్కెట్లో ఎప్‌పీఐల నికర అమ్మకాలు రూ.1.58 లక్షల కోట్లకు చేరాయి. వరుసగా మూడో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం తాజా కరెక్షన్‌కు ఆజ్యం పోసింది. ఆగస్ట్‌లో ఏకంగా రూ.34,990 కోట్లు ఉపసంహరించున్న ఎఫ్‌పీఐలు, జూలైలో రూ.17,700 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. 

‘ఇటీవలి అమ్మకాలకు ప్రధానంగా అమెరికా టారిఫ్‌ల మోతతో పాటు ఇతరత్రా పాలసీ షాక్‌లు ప్రధాన కారణం. భారతీయ వస్తువులపై 50 శాతం టారిఫ్‌ల విధింపు, హెచ్‌1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంపు వంటివి ఎగుమతి ఆధారిత రంగాలపై, ముఖ్యంగా ఐటీ పరిశ్రమ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రూపాయి రికార్డు కనిష్టాలకు పడిపోతుండటం వల్ల తలెత్తుతున్న కరెన్సీ రిస్క్, భారతీయ స్టాక్స్‌లో అధిక వేల్యుయేషన్లు వంటివి కూడా ఎఫ్‌ఐపీలను తాత్కాలికంగా ఇతర ఆసియా మార్కెట్ల వైపు (రొటేషన్‌) దృష్టి సారించేలా చేస్తోంది’ అని మార్నింగ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా ప్రిన్సిపల్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement