ఫ్యూచర్‌ రిటైల్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డీల్‌కు ఓకే.. కానీ

Future Group-Reliance Industries deal gets SEBI approval - Sakshi

షరతులు వర్తిస్తాయ్‌..

ఫ్యూచర్‌–రిలయన్స్‌ డీల్‌కు సెబీ, స్టాక్‌ ఎక్సే్చంజీల అనుమతులు

షేర్‌హోల్డర్లు, ఎన్‌సీఎల్‌టీ అనుమతి తీసుకోవాలని సూచన

న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ రిటైల్‌ వ్యాపారాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలు చేసే డీల్‌కు సంబంధించి స్టాక్‌ ఎక్సే్చంజీలు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షరతులతో కూడిన అనుమతులిచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ఒప్పందానికి ఫ్యూచర్‌ గ్రూప్‌ ఇటు షేర్‌హోల్డర్లతో పాటు అటు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పులకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని స్టాక్‌ ఎక్సే్చంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పేర్కొన్నాయి. అమెజాన్‌డాట్‌కామ్‌ ఫిర్యాదులు, ఫ్యూచర్‌ రిటైల్‌ స్పందన మొదలైన వివరాలన్నీ కూడా స్కీమ్‌లో భాగమైన షేర్‌హోల్డర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించాయి. అలాగే, స్కీమ్‌ ముసాయిదా సమర్పించే ముందు ఎన్‌సీఎల్‌టీకి కూడా తెలియజేయాలని పేర్కొన్నాయి.

ఎన్‌సీఎల్‌టీకి దాఖలు చేసే పిటిషన్‌లో స్టాక్‌ ఎక్సే్చంజీలు, సెబీ సూచనలను కూడా పొందుపర్చాలని తెలిపాయి. మరోవైపు ప్రతిపాది త డీల్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ హక్కులను కాపాడుకునేందుకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని పేర్కొంది. ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్‌ కూపన్స్‌లో అమెజాన్‌ వాటాలు కొనుగోలు చేసింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు లిస్టెడ్‌ కంపెనీ ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటాలు ఉండటంతో.. ఈ డీల్‌ ద్వారా అమెజాన్‌ కూడా వాటాదారుగా మారింది. ఇక కరోనా సంక్షోభ పరిస్థితుల కారణంగా రిటైల్‌ విభాగాన్ని రిలయన్స్‌కు విక్రయించేందుకు ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్‌.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ను ఆశ్రయించింది. అమెజాన్‌ తీరును వ్యతిరేకిస్తూ ఫ్యూచర్‌ గ్రూప్‌ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. ఈ వివాదం ప్రస్తు తం ఆర్బిట్రేషన్, న్యాయస్థానాల్లో నలుగుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top