ఈ దఫా ‘నెవ్వర్‌ బిఫోర్‌’ బడ్జెట్‌

FM Nirmala Sitharaman promises never before like Union Budget - Sakshi

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

మౌలికం, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేసే అవకాశం!  

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ (2021–22) ఈ దఫా ‘ఇంతకు ముందెన్నడూ చూడని’ (నెవ్వర్‌ బిఫోర్‌) విధంగా ఉంటుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారమన్‌ పేర్కొన్నారు. మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొని, వృద్ధిబాటలోకి దూసుకుపోయే బడ్జెట్‌ను ఈ సారి ప్రవేశపెడుతున్నట్లు ఆమె వివరించారు. మహమ్మారి సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వస్తున్న ఈ తరహా బడ్జెట్, 100 సంవత్సరాల భారత్‌ ముందెన్నడూ చూసి ఉండదని ఆమె అన్నారు.  ఆరోగ్యం, మెడికల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్‌అండ్‌డీ) టెలీమెడిసిన్‌ నిర్వహణలో నైపుణ్యత పెంపు అంశాలపై పెట్టుబడుల పెంపు ప్రస్తుత కీలక అంశాలని శుక్రవారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆమె అన్నారు. ‘నెవ్వర్‌ బిఫోర్‌’ బడ్జెట్‌ రూపకల్పనలో అందరి భాగస్వామ్యం అవసరం అని కూడా ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.  2021 ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్‌ పార్లమెంటులో 2021–22 బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్నారు. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్న తరుణంలో ఆర్థికమంత్రి ఈ రంగాన్ని ప్రస్తావించడం గమనార్హం.  

మెడికల్‌ టెక్నాలజీలో అవకాశాలు: ఫార్మా కార్యదర్శి అపర్ణ
దేశంలో మెడికల్‌ టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని  ఫార్మాస్యూటికల్స్‌ శాఖ కార్యదర్శి ఎస్‌.అపర్ణ తెలిపారు. ఈ రంగం వృద్ధి బాటలో ఉందని, మరింత విస్తరణకు అవకాశం ఉందని అన్నారు. సీఐఐ  పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో మెడికల్‌ టెక్నాలజీ భవిష్యత్‌ అన్న అంశంపై శుక్రవారం ఆమె మాట్లాడారు. ‘భారత్‌లో 4,000 పైచిలుకు హెల్త్‌టెక్‌ స్టార్టప్స్‌ ఉన్నాయి. ఆవిష్కరణలు, వ్యవస్థాపకత స్ఫూర్తికి ఇది నిదర్శనం. యువతలో ఉన్న స్వాభావిక ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రస్తుత సంవత్సరంలో ఈ రంగానికి అపూర్వ ఆర్థిక సహాయాన్ని చూశాం. దేశంలో తొలిసారిగా మెడికల్‌ టెక్నాలజీ రంగానికి వచ్చే అయిదేళ్లపాటు సుమారు రూ.7,500 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. వైద్య పరికరాల పార్కుల రూపంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా ఈ ఆర్థిక మద్దతు కొనసాగుతోంది. వైద్య పరికరాలకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఉన్నాయి’ అని వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top