
బెంగళూరులో చేపల ధరలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా స్వల్పకాలంలో గణనీయంగా దాదాపు 30 శాతం పెరిగాయి. బర్డ్ ఫ్లూపై ఆందోళనలు, మటన్ ధర పెరగడం సహా పలు కారణాలతో చేపలకు డిమాండ్ ఊపందుకోవడమే ఈ ఆకస్మిక పెరుగుదలకు కారణమని కొన్ని సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. పరిమిత సరఫరా, పంపిణీ అంతరాయాలు, సముద్రంలో చేపల వేటలో సవాళ్లు వంటివి ధరల్లో మార్పులకు కారణంగా నిలుస్తున్నాయి.
పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా చేపల సరఫరా నిలిచిపోయిందని, ఫలితంగా కొరత ఏర్పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి వల్ల చికెన్ వినియోగం గణనీయంగా తగ్గడానికి దారితీసింది. ఈ సమయంలో చికెన్ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో చికెన్ కొనుగోలుపై ఆసక్తి తగ్గిపోయింది. ప్రత్యామ్నాయంగా ప్రోటీన్‌లు అధికంగా ఉండే చేపల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరిగేందుకు కారణమైంది.
సరఫరాలో అంతరాయం
పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు అధికమయ్యాయి. కీలకమైన సీఫుడ్ హబ్‌గా ఉన్న బెంగళూరులోని రస్సెల్ మార్కెట్‌లో చేపల రాక తగ్గింది. మంగళూరు, చెన్నై, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి ముఖ్యమైన తీర ప్రాంతాల నుంచి వచ్చే చేపల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి తాపం పరిస్థితిని మరింత జటిలం చేసిందని నగరంలోని మార్కెట్లలో చేపల లభ్యత తగ్గిందని మత్స్యకారులు, సీఫుడ్ వ్యాపారులు పేర్కొన్నారు.
వలస వెళ్లి సంతానోత్పత్తి
విశాఖపట్నం, మాల్పే నుంచి వచ్చే బంగుడే (మాకేరెల్) రకం చేపల సరఫరా అస్థిరంగా ఉందని ఓషన్ సీఫుడ్స్ వ్యాపారి లతీఫ్ కె తెలిపారు. చేపల పరిమాణం తగ్గడం, మంగళూరు, తమిళనాడు నుంచి పరిమిత సరఫరా కారణంగా అంజల్ (సీర్ ఫిష్) ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. వచ్చే నెలలో చేపల ధరలు మరింత పెరుగుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా వేసవి సమయంలో చేపలు వలస వెళ్లి సంతానోత్పత్తి సీజన్ ప్రారంభమవుతుంది. దాంతో చేపల వేటను పరిమితం చేస్తారు. ఫలితంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి: త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..
పెరుగుతున్న జలాల ఉష్ణోగ్రతలు
మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో తీరప్రాంత జలాల ఉష్ణోగ్రత పెరగడం ఒకటిగా ఉంది. కర్ణాటక తీరం వెంబడి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు చేపల లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అంచనా చెబుతున్నారు. సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, చేపలు లోతైన, చల్లని జలాలకు వలస వెళతాయి. దాంతో చేపల వేట కష్టతరంగా మారుతుంది. ఇది సాంప్రదాయ చేపల వేట పద్ధతులకు విఘాతం కలిగిస్తుంది. మత్స్యకారులకు దిగుబడిని తగ్గిస్తుంది.