
ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో ఈ నెల 27న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. బ్యాంకుల పనితీరుతోపాటు పలు ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల లక్ష్యాలపైనా చర్చ జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐ ఈ నెల మొదట్లో రెపో రేటును అర శాతం తగ్గించిన తర్వాత ఆర్థిక మంత్రి బ్యాంక్‌లతో నిర్వహిస్తున్న మొదటి సమీక్ష కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదీ చదవండి: తగ్గిన ఇంధన వాడకం
జీడీపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్ట స్థాయి 6.5 శాతానికి తగ్గడంతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఉత్పాదక రంగాలకు రుణ వితరణ పెంచాలని ఆర్థిక మంత్రి ఈ సమావేశంలో బ్యాంక్‌లను కోరే అవకాశాలున్నట్టు తెలిపాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం ముద్రా, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల పరంగా పురోగతిని మంత్రి సమీక్షించనున్నట్టు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంక్‌ల లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 26 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.