Finance Bill 2023: సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను పెంపు

Finance Bill 2023: Government Hikes Securities Transaction Tax On Futures - Sakshi

ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులకు వర్తింపు

ఎంఎఫ్‌ పెట్టుబడులపైనా పన్ను దెబ్బ

డెట్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై ప్రభావం

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌అండ్‌వో) విభాగంలో సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను(ఎస్‌టీటీ) పెంచింది. దీంతోపాటు రుణ సెక్యూరిటీల(డెట్‌) మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపైనా స్వల్పకాలిక పన్నుకు తెరతీసింది.  శుక్రవారం ఎస్‌టీటీసహా 64 సవరణలతో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2023 ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం పొందింది. వెరసి పన్ను సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్‌ బిల్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.

దీని ప్రకారం ఆప్షన్స్‌లో 0.05 శాతం నుంచి 0.0625 శాతానికి, ఫ్యూచర్‌ కాంట్రాక్టులలో 0.01 శాతం నుంచి 0.0125 శాతానికి ఎస్‌టీటీ పెరగనుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయం బలపడటంతోపాటు.. ట్రేడింగ్‌ వ్యయాలు పెరగనుండటంతో మితిమీరిన లావాదేవీలకు చెక్‌ పడనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల భారీ సంఖ్యలో రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఆప్షన్స్‌లో తొలుత 0.017 శాతం నుంచి 0.021 శాతానికి ఎస్‌టీటీ పెరగనున్నట్లు వెలువడిన వార్తలు టైపింగ్‌ పొరపాటుగా ఆర్థిక శాఖ వివరణ ఇవ్వడం గమనార్హం!  

డెట్‌ ఎంఎఫ్‌లపైనా..  
తాజా బిల్లు ప్రకారం డెట్‌ ఎంఎఫ్‌ ఆస్తులలో 35 శాతానికి మించి ఈక్విటీలలో ఇన్వెస్ట్‌ చేయవలసి ఉంటుంది. అంతకంటే తక్కువగా ఈక్విటీలకు మళ్లించే ఎంఎఫ్‌లు స్వల్పకాలిక పెట్టుబడి లాభాల(క్యాపిటల్‌ గెయిన్‌) పన్ను చెల్లించవలసి వస్తుంది. తాజా నిబంధనల ప్రకారం డెట్‌ ఎంఎఫ్‌లు చేపట్టే 35 శాతంలోపు ఈక్విటీ పెట్టుబడులపై శ్లాబులకు అనుగుణంగా పన్ను చెల్లించవలసి వస్తుంది. ప్రస్తుత సవరణలతో మార్కెట్‌ ఆధారిత డిబెంచర్, అధిక శాతం నిధులను రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్‌ చేసే ఎంఎఫ్‌ మధ్య సారూప్యతకు తెరలేవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి ఎంఎఫ్‌లకు ప్రస్తుతం ఇండెక్సేషన్‌ లబ్ధి్దతో కలిపి 20 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్‌(ఎల్‌టీసీజీ) ట్యాక్స్‌ వర్తిస్తోంది.

ఆశ్చర్యకరం
ఎల్‌టీసీజీ సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్‌ బిల్లు ఆశ్చర్యకరమని ఎంఎఫ్‌ పరిశ్రమ అసోసియేషన్‌(యాంఫీ) చైర్మన్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ చీఫ్‌ ఎ.బాలసుబ్రమణ్యన్‌ పేర్కొన్నారు. తాజా మార్పులకు పరిశ్రమ సన్నద్ధం కావలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్‌ బాండ్ల మార్కెట్‌ అభివృద్ధి ఎజెండాను బిల్లు దెబ్బతీసే వీలున్నట్లు పలువురు అసెట్‌ మేనేజర్లు అభిప్రాయపడ్డారు.

పీఎస్‌యూ దిగ్గజాలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లేదా నాబార్డ్‌ జారీ చేసే సెక్యూరిటీలకు డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ అతిపెద్ద సబ్‌స్క్రయిబర్లన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సవరణలపై సమీక్షను చేపట్టవలసి ఉన్నట్లు యాంఫీ వైస్‌చైర్‌పర్సన్, ఎడిల్‌వీస్‌ ఏఎంసీ హెడ్‌ రాధికా గుప్తా పేర్కొన్నారు. దేశీయంగా ఫైనాన్షియలైజేషన్‌ ఇప్పుడిప్పుడే బలపడుతున్నదని, వైబ్రేంట్‌ కార్పొరేట్‌ బాండ్ల మార్కెట్‌కు పటిష్ట డెట్‌ ఫండ్‌ వ్యవస్థ అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.

డెట్‌ ఎంఎఫ్‌లలో పెట్టుబడులకు దీర్ఘకాలిక నిధులు తగ్గిపోతే బాండ్ల జారీ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసి వస్తుందని బాలసుబ్రమణ్యన్‌ వివరించారు. తాజా బిల్లు కారణంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయని మరికొంతమంది నిపుణులు అంచనా వేశారు. కాగా.. మార్కెట్లు అనిశ్చితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌టీటీ పెంపు సరికాదని పారిశ్రామిక సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ పేర్కొంది. ఇది మార్కెట్‌ సెంటిమెంటు, లావాదేవీల పరిమాణంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ సాకేత్‌ దాల్మియా అభిప్రాయపడ్డారు. ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల విక్రయంపై ఎస్‌టీటీ పెంపుపై ఆర్థిక శాఖ స్పష్టతను ఇవ్వవలసి ఉన్నట్లు ఆయన తెలియజేశారు.

అదనపు లావాదేవీ చార్జీలు రద్దు
ఏప్రిల్‌ 1 నుంచి ఎన్‌ఎస్‌ఈ అమలు
ఈక్విటీ నగదు, డెరివేటివ్స్‌ విభాగాలలో విధిస్తున్న అదనపు లావాదేవీల చార్జీలను ఏప్రిల్‌ 1 నుంచి రద్దు చేస్తున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా వెల్లడించింది. 2021 జనవరి 1 నుంచి 6 శాతం పెంపును అమలు చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తాజాగా తెలియజేసింది. ఎన్‌ఎస్‌ఈ ఇన్వెస్టర్‌ రక్షణ నిధి ట్రస్ట్‌(ఐపీఎఫ్‌టీ) మూలధనాన్ని(కార్పస్‌) పెంచేందుకు ఈ చార్జీలలో కొంత భాగాన్ని వినియోగిస్తోంది. రెండేళ్ల క్రితం బ్రోకర్‌ వైఫల్యాల కారణంగా మార్కెట్లలో సంకట పరిస్థితులు తలెత్తడంతో 6 శాతం చార్జీలను ఎన్‌ఎస్‌ఈ విధించింది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top