
ప్రజలపై పన్నుల భారం మరింత తగ్గిస్తాం
కాంగ్రెస్ పాలనలో ట్యాక్స్ లూటీ
సామాన్యులపై విపరీతంగా పన్నులు
ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
గ్రేటర్ నోయిడా/న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో సంస్కరణలు ఇకపైనా కొనసాగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రజలపై పన్నుల భారం మరింత తగ్గుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటుందని అన్నారు. జీఎస్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక రంగానికి కొత్త రెక్కలు తొడుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సంస్కరణల విషయంలో బలమైన సంకల్ప శక్తి మనకు ఉందని ఉద్ఘాటించారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజకీయ స్థిరత్వం కొనసాగుతుండడం సానుకూల అంశాలని వివరించారు.
గురువారం ఉత్తరప్రదేశ్‌లో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో–2025ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ ప్రభుత్వం పన్నుల భారాన్ని క్రమంగా తగ్గిస్తోందని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తోందని అన్నారు. జీఓస్టీలో ఇటీవలే కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని, దీనివల్ల దేశ ప్రజలకు ఈ ఏడాది రూ.రెండున్నర లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు. నేడు దేశమంతా ‘జీఎస్టీ ఆదా ఉత్సవాన్ని’ గర్వంగా నిర్వహించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇది ఇక్కడితో ఆగదని, ప్రజల ఆశీస్సులతో జీఎస్టీలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే...
అవరోధాలే మనకు కొత్త దారులు
‘‘గత ప్రభుత్వాలు పాలనలో విఫలమయ్యాయి. అప్పటి నిర్వాకాలను కప్పిపుచ్చుకోవడానికి మా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో సామాన్య ప్రజలపై విపరీతంగా పన్నులు విధించారు. ట్యాక్స్ లూటీ జరిగింది. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 2047 నాటికి ‘పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్’ మన లక్ష్యం. ఆ దిశగానే దేశం పరుగులు తీస్తోంది. అంతర్జాతీయంగా పలు సవాళ్లు, అవరోధాలు ఉన్నప్పటికీ మన దేశం ఆకర్శణీయమైన ప్రగతి సాధిస్తోంది. అవరోధాలు మనకు అడ్డంకి కాదు. అవే మనకు కొత్త దారులు చూపిస్తున్నాయి.
రాబోయే దశాబ్దాల కోసం ఇప్పుడే బలమైన పునాది వేస్తున్నాం. మన సంకల్పం ఆత్మనిర్భర్ భారత్. మన అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడడం కంటే నిస్సహాయత ఇంకేమైనా ఉంటుందా? రోజురోజుకీ మారుతున్న నేటి ప్రపంచంలో ఇతర దేశాలపై ఆధారపడితే అభివృద్ధి విషయంలో మనం రాజీపడాల్సి వస్తుంది. అందుకే మనం స్వయం సమృద్ధి సాధించాలి. మనం వాడుకొనే ప్రతి వస్తువూ ఇక్కడే తయారు కావాలి. మేడ్ ఇన్ ఇండియా సరుకులే మనం కొనుగోలు చేయాలి.
రష్యాతో స్నేహబంధం బలోపేతం
రష్యాతో మన స్నేహబంధం కాలపరీక్షకు నిలిచింది. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం అవిచి్ఛన్నంగా కొనసాగుతోంది. ఈసారి ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో రష్యా సైతం భాగస్వామి. ఈ కార్యక్రమం ద్వారా రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం. రష్యా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ఏకే–203 రైఫిళ్ల తయారీ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఉత్తరప్రదేశ్‌లో డిఫెన్స్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నాం.
ఇక్కడ బ్రహ్మోస్ క్షిపణులు, ఆయుధ వ్యవస్థల తయారీ ఇప్పటికే ప్రారంభమైంది. దేశంలో స్వావలంబనను బలోపేతం చేసే విధానాలు రూపొందించాలని వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను కోరుతున్నా. సైనిక దళాలకు అవసరమైన ఆయుధాలు, రక్షణ వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలి. మనకు కావాల్సినవి మన దేశంలోనే తయారు చేసుకుందాం. సైన్యం వాడుకొనే వస్తువులు, ఆయుధాలపై మేడ్ ఇన్ ఇండియా ముద్ర ఉండాల్సిందే’’ అని ప్రధాని మోదీ వివరించారు.
ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టండి
భారత ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టా లని అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు మోదీ చెప్పారు. దేశంలో ఈ రంగంలో వ్యాపారాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గత పదేళ్లుగా తమ ప్రభుత్వం ఆహార శుద్ధి రంగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి అనుసంధాన పథకాలు ప్రవేశపెట్టామని, మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటివల్ల ఆహార శుద్ధి సామర్థ్యం 20 రెట్లు పెరిగిందని, ఎగుమతులు రెండు రెట్లు పెరిగాయని ఉద్ఘాటించారు. గురువారం ఢిల్లీలో ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ నాలుగో ఎడిషన్ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. శుద్ధి చేసిన ఆహారాన్ని నిల్వ చేయడానికి పర్యావరణహిత బయో డిగ్రేడబుల్ ప్యాకేజింగ్ తయారీలో సైతం పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
విద్యుత్ ఉత్పత్తి అత్యవసరం
విద్యుత్ ఉత్పత్తి ప్రాధాన్యతను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. 21వ శతాబ్దంలో ఏ దేశమైనా వేగంగా ప్రగతి సాధించాలంటే విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడం అత్యవసరమని స్పష్టంచేశారు. గురువారం రాజస్తాన్‌లోని బనస్వర జిల్లాలో ఆయన పర్యటించారు. రూ.1.22 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.42,000 కోట్లతో నిర్మించనున్న అణు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ సందర్భంగా బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.
కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడిగా విద్యుత్ ఉండేదని, గ్రామాల్లో కనీసం ఐదు గంటలు కూడా కరెంటు సరఫరా అయ్యేది కాదని చెప్పారు. తగినంత విద్యుత్ లేకపోవడంతో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్నారు. తమ ప్రభుత్వం వచి్చన తర్వాత విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. నేడు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికీ విద్యుత్ సరఫరా అవుతోందని, ప్రజల జీవనం సులభతరంగా మారిందని అన్నారు. క్లీన్ ఎనర్జీలో ముందంజలో ఉన్న దేశాలు విజయవంతమైన దేశాలుగా కీర్తినందుకుంటాయని స్పష్టంచేశారు. బనస్వర జిల్లాలో ‘పీఎం–కుసుమ్’ పథకం లబ్ధిదారులతో ప్రధాని మోదీ సంభాషించారు. రైతుల అనుభవాలు అడిగి తెలుసుకున్నారు.
నేడు బిహార్ పథకం ప్రారంభం
బిహార్‌కు సంబంధించిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేస్తారు. మొత్తం రూ.7,500 కోట్లు విడుదల చేయబోతున్నారు. మహిళల సాధికారత, స్వావలంబనే లక్ష్యమని బిహార్ ప్రభుత్వం వెల్లడించింది.