
ఏప్రిల్ నెలలో రూ.2.19 లక్షల కోట్లు
ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో జోరు
మార్చిలో రూ.2.02 లక్షల కోట్ల ఉపసంహరణ
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏప్రిల్ నెలలో మంచి జోరు చూపించాయి. ఈ విభాగంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఎక్కువ మంది ముందుకు వచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత రక్షణాత్మక ధోరణితో డెట్ విభాగం వైపు మొగ్గు చూపించినట్ట తెలుస్తోంది. ఫలితంగా ఏప్రిల్ నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో (2025 మార్చిలో) ఇదే డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.2.02 లక్షల కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం.
అంటే ఒక్క నెలలోనే ఇన్వెస్టర్ల ప్రాధాన్యంలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో పెట్టుబడుల్లో మార్పులు–చేర్పులు కూడా ఇందుకు కారణమై ఉండొచ్చు. సంస్థాగత ఇన్వెస్టర్లు ముందస్తు పన్ను చెల్లింపులు, బ్యాలన్స్ షీట్ల సర్దుబాట్లు మార్చి నెలలో పెట్టుబడుల ఉపసంహరణకు కారణమై ఉండొచ్చని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెచ్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెస్రామ్ తెలిపారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.6,525 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోగా.. జనవరిలో రూ.1.28 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.
లిక్విడ్ ఫండ్స్‌లోకే అధికం..
→ డెట్‌లో లిక్విడ్ ఫండ్స్‌లోకి అత్యధికంగా ఏప్రిల్ నెలలో రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
→ ఓవర్‌నైట్ ఫండ్స్ రూ.23,900 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.31,507 కోట్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి.
→ అల్ట్రా షార్ట్ ఫండ్స్‌లోకి రూ.26,734 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.9,371 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.
→ గిల్ట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.425 కోట్లను ఉపసంహరించుకున్నారు. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి రూ.302 కోట్లు, గిల్ట్ ఫండ్స్ నుంచి 39 కోట్లు చొప్పున బయటకు వెళ్లిపోయాయి.
→ మొత్తానికి ఏప్రిల్ నెలలో మ్యూచువల్ ఫండ్స్‌లోని అన్ని విభాగాల్లోకి కలిపి నికరంగా రూ.2.77 లక్షల కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రూ.17.57 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు
ఏప్రిల్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ పెట్టుబడులు (ఏయూఎం) రూ.17.57 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు మార్చి చివరికి డెట్ నిర్వహణ ఆస్తుల విలువ రూ.17.02 లక్షల కోట్లుగా ఉంది. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్యలోనూ వృద్ధి కనిపించింది. ఏప్రిల్‌లో కొత్తగా 1.44 లక్షల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) ప్రారంభమయ్యాయి.
మొత్తం డెట్ ఫోలియోలు 79.36 లక్షలకు చేరాయి. డెట్‌లో మొత్తం 16 కేటగిరీలు ఉంటే అందులో 12 కేటగిరీల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ‘‘ఏప్రిల్‌లో డెట్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రాక పెరగడం అన్నది స్థిరాదాయ పథకాల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వసానికి నిదర్శనం’’అని మార్నింగ్ స్టార్ మెస్రామ్ తెలిపారు. లిక్విడ్ ఫండ్స్‌లోకి ఎక్కువ పెట్టుబడులు రావడం అన్నది స్వల్పకాల పెట్టుబడుల పట్ల ప్రాధాన్యాన్ని సూచిస్తున్నట్టు ఈక్విరస్ వెల్త్ ఎండీ అంకుర్ పంజ్ తెలిపారు.