గోల్డ్‌ కొనాలా.. వద్దా.. | Explanation Of PM Narendra Modi Gold Purchases One Year Postponement | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ కొనాలా.. వద్దా..

May 18 2026 12:41 AM | Updated on May 18 2026 1:19 AM

Explanation Of PM Narendra Modi Gold Purchases One Year Postponement

పసిడిపై ప్రధాని మోదీ వార్నింగ్‌...ఎవరికి టెన్షన్‌

అందరికీ ఒకటే రూల్‌ కాదు 

నగలు కొనేవారే ఆలోచించాలి 

ఇన్వెస్ట్‌ చేస్తే కథ వేరే 

నగల మోజా? పోర్ట్‌ఫోలియో ప్రొటెక్షనా? గోల్డ్‌ అసలు పని ఏది 

బంగారం మీ సంపద పెంచదు... సంపదను కాపాడుతుంది 

మోదీ గోల్డ్‌ అప్పీల్‌ వెనక ఎకానమీ మ్యాథ్స్‌ తెలుసుకోండి

‘కొంతకాలం బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ పిలుపుతో కొనుగోళ్లు ఆపాలని కొందరు , ఏడాది పాటు వాయిదా వేయాలని మరికొందరు చర్చలకు దిగారు ఇప్పటికే కొనేశాంగా మరి అమ్మేయాలా అని అనేకమంది సందిగ్ధంలో పడ్డారు.  

సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లో ఈటీఎఫ్‌లుగా కొంటున్నవారు ఏంచేయాలో తోచక అయోమయంలో పడ్డారు. అయితే  ప్రధాని పిలుపు ఒక రకమైన కొనుగోలుదారులకు పూర్తిగా వర్తిస్తుంది. మరొక వర్గం కొనుగోలుదారులకు  అంతగా సంబంధం ఉండకపోవచ్చు.  కానీ చాలా మందికి తాము ఏ రకమైన బయ్యర్లో తెలీదు. 

అది తెలిస్తే మీరు బంగారం కొనాలో, అమ్మాలో, కొనసాగించాలో నిజంగా ఏంచేయాలో స్పష్టమవుతుంది. క్రూడ్, చమురు దిగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యంపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించేందుకు  ప్రధాని మోదీ గత వారం  చేసిన బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలన్న పిలుపును బాధ్యత గల పౌరులుగా సీరియస్‌గా తీసుకోవాల్సిందే.  

పతనమవుతున్న రూపాయి , పశ్చిమ ఆసియాలో అస్థిర పరిస్థితి, పెరుగుతున్న దిగుమతి బిల్లు వంటి కారణాలను ప్రధాని ప్రస్తావించారు. అయితే ఈ పిలుపునకు అందరూ ఒకేరకంగా స్పందించాల్సిన అవసరంలేదు. సరదాగా, ఆడంబరం కోసం, ఫ్యాషన్‌గా ప్రదర్శించుకునేందుకు మీరు నగలు కొనేవారైతే ఈ పిలుపు మీకు పూర్తిగా వర్తిస్తుంది. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలి అనుకుంటే ఆపడానికి ఆలోచించాల్సిందే. అదెలాగో తెలుసుకుందాం...

ప్రధాని పిలుపు అసలు అర్థం ఏమిటి?
భారతదేశం వినియోగించే బంగారంలో 99 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే వస్తుంది. దేశంలో గణనీయమైన స్థాయిలో బంగారం తవ్వకం జరగదు. నగలు, నాణేలు, బార్లు ఏ రూపంలో అయినా బంగారం కొనడానికి ఖర్చు చేసే ప్రతి రూపాయి డాలర్ల రూపంలో దిగుమతులకే వెళ్తుంది. డాలరు మారకంలో రూపాయి విలువ 96 స్థాయికి పతనమై  ఒకవైపు దిగుమతి బిల్లు పెరుగుతున్న సమయంలో బంగారం డిమాండ్‌ పెరగడం ఆర్థిక పరిస్థితిని మరింత కఠినతరం చేస్తోంది. ఎందుకంటే బంగారం దిగుమతులకు ప్రభుత్వం డాలర్లలోనే చెల్లిస్తుంది. డిమాండ్‌ పెరిగితే డాలర్లు భారీగా బయటకు వెళ్తాయి. దాంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడితే కీలకమైన దిగుమతులైన చమురు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు అన్నీ ఖరీదవుతాయి. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అది చివరికి సాధారణ కుటుంబాలపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రధాని పిలుపులో భావోద్వేగం కన్నా గణాంకాలకే మనం ప్రాధాన్యం ఇవ్వాలి.

ఎవరి కోసం...
ఈ పిలుపు అత్యంత ప్రభావం చూపేది జ్యువెలరీ కొనుగోలుదారులపైనే. ఎందుకంటే నగలలో బంగారం విలువతో పాటు 10 నుంచి 15 శాతం వరకు మేకింగ్‌ చార్జీలు, జీఎస్‌టీ కూడా ఉంటాయి. ఇవి తిరిగి రికవర్‌ కాని ఖర్చులు. అంటే నగలను పెట్టుబడిగా భావించే వారు , కొనుగోలు చేసిన క్షణం నుంచే తమ సంపదను అంతకన్నా ఎక్కువ శాతంగా అంచనా వేస్తారు. నగలు అనేవి వినియోగం కోసమే. పెట్టుబడి కోసం కాదు. అందుకే ప్రధాని పిలుపు వీరిని ఉద్దేశించి చేసిందిగా గమనించాలి.

బంగారం పని సంపద పెంచడం కాదు ...రక్షణ ఇవ్వడం
ప్రధాని పిలుపును పాటించాలా వద్దా అనుకునే ముందు, మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం అసలు ఏ పని చేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలి. బంగారంపై పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు ఉండటం సరైనదిగా పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు భావిస్తారు. అది సంపదను వేగంగా పెంచడానికి కాదు. ఒక రకమైన ఇన్సూరెన్స్‌లా పనిచేయడానికి. ఈక్విటీలు దీర్ఘకాలంలో సంపదను పెంచుతాయి. డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లు మూలధనాన్ని కాపాడి వడ్డీ ఇస్తాయి. బంగారం పని మాత్రం వేరు. రూపాయి బలహీనపడినప్పుడు లేదా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు, బంగారం సాధారణంగా తన విలువను నిలబెట్టుకుంటుంది. ఆసమయంలో ఇతర పెట్టుబడులను కాపాడేది బంగారం. ఆ పరిస్థితులకు హెడ్జింగ్‌గా బంగారాన్ని అలొకేషన్‌లో ఉంచుతారు.

నగలు, ఈటీఎఫ్‌లు ఎస్‌జీబీలు పూర్తిగా భిన్నం
దిగుమతుల స్థాయిలో చూస్తే బంగారం అంటే బంగారమే. దేశంలో జ్యువెలరీ తయారీ దారులు గోల్డ్‌ బార్లు దిగుమతి చేసుకుని  నగలుగా మారుస్తారు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు , గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లు కూడా తమ యూనిట్లకు బ్యాకింగ్‌గా ఫిజికల్‌ గోల్డ్‌ కొనాల్సి ఉంటుంది. కాబట్టి దిగుమతి భారంలో పెద్ద తేడా ఉండదు. ఇక్కడ అసలు తేడా దిగుమతుల్లో కాదు. దానికి చేసే వ్యయంలో ఉంది.

గోల్డ్‌ఈటీఎఫ్‌లు – మ్యూచువల్‌ ఫండ్లు 
గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లు కూడా ఫిజికల్‌ గోల్డ్‌ దిగుమతులపైనే ఆధారపడతాయి. వీటి విషయంలో మేకింగ్‌ చార్జీలు ఉండవు. గోల్డ్‌ విలువపై జీఎస్‌టీ ఉండదు. తిరిగి అమ్ముకోవడం కూడా తేలిక.

ఎస్‌జీబీలే నిజమైన మినహాయింపు
సావరిన్‌ గోల్డ్‌ బాంండ్ల (ఎస్‌జీబీ)కు మాత్రమే నిజమైన ప్రత్యేక మినహాయింపు వర్తిస్తుంది. బాండ్ల విషయంలో ప్రభుత్వం బంగారం ధరలకు అనుసంధానమైన ఒక పేపర్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ను జారీ చేస్తుంది. ఇందులో ఫిజికల్‌ గోల్డ్‌ కొనుగోలు లేదా దిగుమతి అవసరం ఉండదు. ఇష్యూ సమయంలో కొనుగోలు చేసిన వారు ఎనిమిదేళ్లు హోల్డ్‌ చేస్తే, 2.5 శాతం వార్షిక వడ్డీతో పాటు మెచ్యూరిటీ సమయంలో ట్యాక్స్‌ ఫ్రీ లాభాన్ని పొందేవారు. అయితే ఇప్పుడు కొత్త సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ ఇష్యూలు ఆగిపోయాయి. చివరిసారిగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండు సంవత్సరాల క్రితం కొత్త ట్రాంచ్‌ను విడుదల చేసింది.

ఇప్పుడు చేయాల్సింది ఏమిటి?
మీ గోల్డ్‌ ఈటీఎఫ్‌లు గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కలిపి లెక్కించండి. నగలను లెక్కలోకి తీసుకోకండి. ఎందుకంటే అవి వినియోగానికి ఉద్దేశించినవి. మొత్తం పెట్టుబడుల్లో బంగారం శాతం ఎంత ఉందో చూడండి. అది 5 నుంచి 10 శాతం మధ్యలో ఉంటే  ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 శాతం కంటే తక్కువైతే పోర్ట్‌ఫోలియో సమతుల్యత కోసం కొంత కొని పెంచుకోవచ్చు.10 శాతం దాటితే కొంత తగ్గించి ఆవచ్చే డబ్బును ఈక్విటీ, డెట్‌ లేదా క్యాష్‌ వైపు మార్చడం మంచిది.

 ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మార్కెట్‌ టైమింగ్‌ వల్ల ఈ పనిచేయడంలేదు. రీబ్యాలెన్సింగ్‌ మాత్రమే చేస్తున్నాం. బంగారాన్ని ఇన్సూరెన్స్‌లా చూడండి. ఇన్సూరెన్స్‌ను ఎవరైనా అవసరం వచ్చినప్పుడు కాదు, ముందుగానే కొనుగోలు చేస్తారు. బంగారంపై పెట్టుబడి కూడా అంతే.. పెరుగుతున్నపుడు కొనడం సరైన పెట్టుబడి విధానం కాదు. ప్రధాని పిలుపు బంగారం వినియోగం కోసం కొనేవారి విషయంలో సరైనదే. ముఖ్యంగా నగలు కొనేవారు దానిని సీరియస్‌గానే తీసుకోవాలి. ఇప్పటికే 5 నుంచి 10 శాతం సరైన గోల్డ్‌ అలొకేషన్‌ కలిగిన పెట్టుబడిదారు తన పోర్ట్‌ఫోలియోను కదిలించాల్సిన పనిలేదు. మొదటి నుంచి పెట్టుబడి ప్రణాళిక సరైనదైతే ఇప్పుడు చేయాల్సింది దానికి కట్టుబడి ఉండటమే.

చరిత్ర ఏం చెబుతోంది?
2013లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తమ బాండ్‌ కొనుగోళ్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. దాంతో రూపాయి సహా అనేక ఎమర్జింగ్‌ మార్కెట్‌ కరెన్సీలు బలహీనపడ్డాయి. 2020 కరోనా సంక్షోభం, 2022 ఎనర్జీ క్రైసిస్‌ సమయంలో కూడా ఇదే జరిగింది. ప్రతి సందర్భంలో రూపాయి బలహీనపడగా, ఈక్విటీలు నష్టపోగా, గోల్డ్‌ ధరలు మాత్రం పెరిగాయి. ఆ సమయంలో కొంత బంగారం కలిగి ఉన్న పోర్ట్‌ఫోలియోలు మాత్రమే సంక్షోభాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఇక్కడ గమనించాల్సింది ఒకటే బంగారం మిమ్మల్ని ధనవంతులను చేయడానికి కాదు, మీ సంపద పెంచడానికి కాదు మార్కెట్‌ కష్టకాలంలో మీ ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని.

– సాక్షి, వెల్త్‌ డెస్క్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement